సబ్సిడీ గ్యాస్ కట్టడికి కఠిన చర్యలు
• చమురు శాఖకు రూ.10 లక్షల ఆదాయ వ్యక్తుల సమాచారం
• త్వరలో ఐటీ శాఖతో ఒప్పందం
న్యూఢిల్లీ: అధిక ఆదాయ వర్గాలకు సబ్సిడీ వంట గ్యాస్ అందకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యేకించి రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వ్యక్తుల సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ,చమురు, పెట్రోలియం మంత్రిత్వశాఖకు సమర్పించనుంది. సమాచారం అందజేత, భద్రత ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ), పెట్రోలియం శాఖ మధ్య త్వరలో ఒక అవగాహనఒప్పందం కుదరనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం అధిక ఆదాయ వ్యక్తి పేరు, పాన్ నంబర్, పుట్టినతేదీ, ఈ–మెయిల్ ఐడీ, ఇంటి లేదా ఆఫీస్ ఫోన్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలనూ పెట్రోలియం మంత్రిత్వశాఖకు ఐటీ శాఖ ఎప్పటికప్పుడు అందిస్తుంది.
ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం 14.2 కేజీల బరువున్న 12 గ్యాస్ సిలిండర్లు ఏటా సబ్సిడీపై పొందే వీలుంది. ధనవంతులుతమకుతాముగా గ్యాస్ సబ్సిడీ వద్దంటూ డిక్లరేషన్‌లు ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పన్నులకు లోబడి వినియోగదారు లేదా వారి భాగస్వామిగానీ వార్షికంగా రూ.10 లక్షలకుపైగా ఆదాయంపొందుతుంటే, వారికి సబ్సిడీ గ్యాస్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కూడా అప్పట్లో కేంద్రం ప్రకటించింది.