
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజ్‌భవన్‌లో భారీ పొదుపు చర్యలు ప్రకటించారు.
ముంబై : కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాజ్‌భవన్ ఖర్చుల్లో భారీ కోత విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను గణనీయంగా తగ్గించాలని రాజభవన్ అధికారులకు సూచించారు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదని, రాజ్‌భవన్‌లో భారీ నిర్మాణ పనులు, మరమ్మత్తులు నిర్వహించరాదని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులనే చేపట్టాలని సూచించారు. ఆగస్ట్ 15న పుణే రాజ్‌భవన్‌లో తలపెట్టిన స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని ఆయన నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో ఎలాంటి నూతన నియామకాలు చేపట్టరాదని ఆదేశించారు.
రాజ్‌భవన్ అవసరాల కోసం కొత్త కారు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పక్కనపెట్టారు. వీవీఐపీలకు బహుమతులు ఇచ్చే సంపద్రాయాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ నిలిపివేయాలని స్పష్టం చేశారు. వీసీలు, ఇతర అధికారులతో సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించాలని, ప్రయాణ ఖర్చులపై వ్యయం తగ్గించాలని సూచించారు. ఈ చర్యల ద్వారా రాజ్‌భవన్ బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, గవర్నర్ ఇప్పటికే తన నెల జీతాన్ని కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వగా, తన వార్షిక వేతనంలో 30 శాతం పీఎం కేర్స్ ఫండ్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.