- టీడీఎన్ మోహనకృష్ణ కేసు బదలాయింపు
- 552 మంది బాధితులు
- రూ. 8 కోట్లకు టోకరా
అవనిగడ్డ : దివిసీమలో సంచలనం సృష్టించిన చిట్టీపాటల కుంభకోణం కేసులో నిందితుడైన టీడీఎన్ మోహనకృష్ణ కేసును జిల్లా ఎస్పీ సూచనల మేరకు సీబీసీఐడీకి బదిలీ చేయడం దివిసీమలో సర్వత్రా చర్చనీయాంశమైంది. 1990 ఏప్రిల్ 16వ తేదీన వేకనూరులో జరిగిన ఐదు హత్యలకేసును సీబీసీఐడీకి అప్పగించిన దరిమిలా మరలా ఈ ప్రాంతానికి చెందిన కేసును సీబీసీఐడీకి అప్పగించటం ఇదే.
చిట్టీపాటల పేరుతో కోట్లాది రూపాయలు వసూలుచేసి టీడీఎన్ అదృశ్యం కావడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అవనిగడ్డలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులను, జిల్లా ఎస్పీని కలసి విన్నవించారు. అదృశ్యమైన రెండు వారాల తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీఎన్ మచిలీపట్నం కోర్టులో లొంగిపోయాడు. ఆ దరిమిలా నాటి సీఐ ఎన్.సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసు కస్టడీ పిటీషన్ వేయడంతో మూడు రోజులపాటు టీడీఎన్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ మూడు రోజుల వ్యవధిలో పోలీసులు టీడీఎన్ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. టీడీఎన్ ఆస్తులన్నీ ఆయన భార్య పేరిట ఉండడంతో ఆమెను సైతం పోలీసులు అరెస్టు చేశారు. టీడీఎన్ కుమార్తె కార్యక్రమానికి సంబంధించి ఆమెను నాలుగు రోజులపాటు బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల విచారణలో టీడీఎన్ ఇచ్చిన సమాచారం మేర రూ.70లక్షలు ఆయనకు చిట్టీపాటల రూపంలో బకాయిలు రావల్సి ఉండగా మరో రూ.70లక్షలు ఈయన ఇతర ఫైనాన్సర్లకు చెల్లించాలని లెక్క తేల్చారు.
చిట్టీపాటల బాధితుల్లో 552మందికి సుమారు రూ.8కోట్లకుపైగా చెల్లించాల్సి వచ్చినట్లు లెక్కతేలింది. సంబంధిత చిట్టీపాటల బాధితుల పేర్లు, వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని నాటి ఎస్‌ఐ వెంకటకుమార్ రికార్డు చేశారు. టీడీఎన్‌కు ప్రస్తుతం కండీషన్ బెయిల్ లభించింది. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు అవనిగడ్డ పోలీసుస్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంది. కాగా ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే ఆయన బినామీలుగా ఉన్నవారి ఆస్తులు వెలుగులోకి వస్తాయన్న భావనతో ఉన్నారు.
టీడీఎన్ పాటదారులకు చెల్లించాల్సిన బకాయిలను, ఆయన ఆస్తులను బేరీజు వేసుకుంటే రూపాయికి 30పైసలు వంతున వచ్చే అవకాశం కూడా లేదు. విషయం తెలిసిన బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీఎన్‌కు బెయిల్ వచ్చినప్పటికీ కేసును సీబీసీఐడీకి అప్పగించడంతో సంబంధిత అధికారులు మళ్లీ ప్రశ్నించనున్నట్లు తెలియవచ్చింది.