కాకినాడ క్రైం : విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తు చేసేందుకు వెళ్లి, మోటార్‌బైక్‌పై తిరిగిగొస్తున్న ఎస్సై ఆనంద్‌కుమార్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం హనుమాన్ నగర్‌కు చెందిన రాచర్ల ఆనంద్‌కుమార్(38) ఎస్సైగా 2002 బ్యాచ్‌లో ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన ఆయన కొంతకాలం అక్కడే విధులు నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రొబెషనరీ ఎస్సైగా ఐదు నెలల పాటు పనిచేశారు.
అనంతరం ఉప్పలగుప్తం ఎస్సైగా రెండేళ్లు, విజయవాడ టూ టౌన్ ఎస్సైగా ఎక్కువ కాలం పనిచేశారు. మూడు నెలల క్రితం కోరంగి ఎస్సైగా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాకినాడ సురేష్‌నగర్ పార్కు ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఆయన మోటార్ బైక్‌పై మరో ప్రాంతానికి వెళ్లారు. అర్థరాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, సామర్లకోట రూరల్ మండలం కొప్పవరం జంక్షన్ వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది. ఎస్సై ఆనంద్‌కుమార్ పొట్టపై నుంచి టిప్పర్ చక్రాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనతో పాటు చందమామ రెస్టారెంట్ రాజు కూడా మోటార్ బైక్‌పై ఉన్నారు.
ప్రమాదంలో రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తిమ్మాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆనంద్‌కుమార్‌కు భార్య ఝాన్సీలక్ష్మి, తొమ్మిదేళ్ల కుమార్తె సంజన, నాలుగేళ్ల కుమారుడు రిషీ ఉన్నారు. ఎస్సై ఆనంద్‌కుమార్ భౌతికకాయాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం. రవిప్రకాష్, ఇతర అధికారులు సందర్శించి నివాళులర్పించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్‌కుమార్ స్వగ్రామానికి తరలించారు.
ఎస్సై మృతితో విషాదఛాయలు
తాళ్లరేవు : కోరంగి ఎస్సై రాచర్ల ఆనంద్ కుమార్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ మూడేళ్ల పాటు ఎస్సైగా విశేష సేవలందించిన ఆనంద్‌కుమార్ సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పలగుప్తం మండలంలోరెండున్నరేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న కోరంగి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. కేవలం రెండున్నర నెలల్లోనే అక్రమ వ్యాపారాలను, నేరాల సంఖ్యను అదుపు చేశారు. అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. ఇంతలోనే ఆయన మరణించడాన్ని ప్రజలు, సహచర సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి అనేక మంది అధికారులు, నాయకులు, సహచరులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆనంద్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
పదోన్నతి రాకుండానే..
మరో రెండు నెలల్లో ఆనంద్‌కుమార్‌కు సీఐగా పదోన్నతి రానున్నట్టు ఇటీవల తెలిసింది. పదోన్నతి అందుకోకుండానే ఆయన మరణించడంతో స్టేషన్ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పోలీస్‌స్టేషన్‌కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టేషన్‌కు సమీపంలోని సురేష్ నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కోరంగి సొసైటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి లక్ష్మయ్య ఇంట్లో వెళ్లేందుకు రెండు రోజుల క్రితం పాలు పొంగించారు. విధి నిర్వహణే ఊపిరిగా ఆనంద్‌కుమార్ ఉండేవారని కానిస్టేబుల్ శ్రీను చెప్పారు. నిరంతరం స్టేషన్‌లో అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి అత్యధిక సమయం కేటాయించేవారన్నారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే నేరాలను అదుపు చేశారని సుంకరపాలేనికి చెందిన చీకట్ల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నారన్నారు.
టిప్పర్ ఢీకొని ఎస్సై దుర్మరణం
Published Thu, Jun 25 2015 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement