Anandkumar
-
లెక్కలు చెప్తా
...అంటున్నారు హృతిక్ రోషన్. ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారేమోనని పొరపాటు పడకండి. ఎందుకంటే ఆయన బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆనంద్‌కుమార్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదూ! ‘సూపర్30’ ప్రోగ్రామ్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ప్రముఖ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సంస్థల్లో ఆడ్మిషన్ పొందేలా కృషి చేస్తున్న మ్యాథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్. రీల్‌పై ఆనంద్కుమార్గా కనిపించడానికి రెడీ అయ్యారు హృతిక్. హిందీలో ‘క్వీన్’, ‘షాందార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన వికాస్ బాల్ ‘సూపర్ 30’ టైటిల్‌తోనే ఈ సినిమా రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 23న సినిమాను విడుదల చేయన్నట్లు ప్రకటించారు. -
సెల్ లేదు... విల్ ఉంది...
స్ఫూర్తి ఆ ఊర్లో ఉండే కుటుంబాల సంఖ్య 150కి మించ దు. కరెంటొచ్చి ఆరేళ్లయింది. ఇప్పటికీ సెల్ఫోన్లో కబుర్లు చెప్పుకునే చాన్స్ లేదు. ఎందుకంటే 50 కి.మీ దూరం వెళితేగాని సిగ్నల్స్ లేవు మరి. ఇంతగా వెనుకబడిన మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఊర్లో లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటూ కూర్చోలేదు. అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో తమ చిన్న ఊరి ప్రతిష్టను కొండంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన భద్రయ్య... తలచుకుంటే కొండలు సైతం తలవంచుతాయని నిరూపించారు. ‘‘రెండేళ్ల క్రితం భద్రాచలం యువకుడు ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్ ఎక్కడంతో దీనిపై ఆసక్తి వచ్చింది. ఆయన దగ్గర నుంచే ఆ వివరాలను తెలుసుకున్నా’’నన్నారు ఎపి జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగి భద్రాచలం సమీపంలోని చింతూరు గ్రామవాసి భద్రయ్య. తూర్పుగోదావరిజిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రంలో రోజుకు రూ.120 వేతనం అందుకునే కాంట్రాక్ట్ ఉద్యోగి దూబి భద్రయ్య... ఎవరెస్ట్ శిఖరాధిరోహణపై ఆసక్తి చూపడమే విశేషం. ఆసక్తినే అద్వితీయ శక్తిగా మలచుకుని కొండంత ఆశయాన్ని సాధించడం మరింత గొప్ప విశేషం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను సాక్షికి ఇలా వివరించారాయన. క్రమశిక్షణతో...కఠోరశిక్షణ... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే ఆలోచన తర్వాత దీనికి సంబంధించి శిక్షణ కోసం ఈ సాహసయాత్రకు గత కొంతకాలంగా మార్గదర్శకత్వం చేస్తున్న శేఖర్‌బాబును కలిశాను. ఆయన నాకు అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఫిట్నెస్ను నిర్ధారించుకున్నారు. జులైలో నన్ను ఎంపిక చేశారు. అత్యంత శీతల వాతావరణాన్ని నా శరీరం తట్టుకుంటుందా లేదా అనే పరిశీలన కూడా చేశారు. అనంతరం సిక్కిం, హిమాలయాల్లో శిక్షణ. అది నవంబరు నెల వరకూ సాగింది. అదైపోయాక భువనగిరిలో సాంకేతిక అంశాలపై 3నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం, నా గుర్తింపు కార్డులన్నీ తెలంగాణకు చెందినవి కావడంతో పాస్‌పోర్ట్ జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంత కష్టపడిందీ వృధా పోతుందేమో అని భయపడినా... జిల్లా కలెక్టర్, స్థానిక ఐటీడిఎ పిఓల సహకారంతో ఈ సమస్య పరిష్కారమైంది. సాహసయాత్రకు శ్రీకారం... అన్ని బాలారిష్టాలు అధిగమించాక... ఏప్రిల్7న సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి ఖాట్మండు అనంతరం సిసలైన కఠిన పరీక్షకు సిద్ధం అయ్యాను. గత ఏడాది తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ఖాట్మండు నుంచి కొడారి వెళ్లే దారి సైతం దెబ్బతింది. నేపాల్ చైనాల మధ్య వంతెన పాడైపోయింది. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లలేక విమానంలో లాసా వరకు వెళ్లాను. లాసా నుంచి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ 800కి.మీ దూరం ఉంటుంది. నేరుగా వెళితే రెండ్రోజులు పడుతుంది. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు దేహం అనువుగా మారేందుకు ఈ దూరం ఉపకరిస్తుంది. అక్కడక్కడ ఆగుతూ లాసా నుంచి బేస్ క్యాంప్‌కు చేరడానికి 7 రోజులు పట్టింది. బేస్‌క్యాంప్ సముద్రమట్టానికి దాదాపు 5200కి.మీ ఎత్తులో ఉంటుంది. దీని తర్వాత 6400 కి.మీ ఎత్తులో మరో అడ్వాన్స్ బేస్ క్యాంప్ ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితం... అత్యంత ఎత్తులో ఆక్సిజన్ అందని పరిస్థితుల మధ్య పర్వతారోహణ సాగింది. శరీరంపై 15 కిలోల బరువుతో మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ గడ్డకట్టించేస్తుంటే, విపరీతమైన వేగంతో వీచే చలిగాలులు కోసేంత పదునుగా తాకుతుంటే ఇబ్బందుల్ని మొక్కవోని పట్టుదలతో అధిగమిస్తూ ముందడుగేశా. అడుగడుగునా ఆత్మవిశ్వాసానికి సవాళ్లు ఎదురవుతాయీ పర్వతారోహణలో. ఒక్కసారి కాలు జారితే కొన్ని వేల కిలోమీటర్ల దిగువకు పడిపోతాం. ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేసి విఫలమైన వారి మృతదేహాలు అడుగుకొకటి కనపడుతూ ధైర్యానికి పరీక్ష పెట్టాయి. ఏదేమైతేనేం... సాధించాలి అనే పట్టుదల తప్ప మరే ఆలోచనను, భయాన్నీ దరిచేరనీయకుండా ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరాక... ముందుగా గుర్తొచ్చింది మా చిన్న ఊరు. ఒక మారుమూల ప్రాంతపు గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా అంత గొప్ప కలను సాకారం చేసుకోవడం కొండంత సంతృప్తిని అందించింది’’ అంటూ చెప్పారు భద్రయ్య. అత్యంత వ్యయప్రయాసలతో కూడిన ఈ యాత్రకు శిక్షణా ఖర్చుల్ని శేఖర్‌బాబు సారథ్యంలోని రాక్‌క్లైంబింగ్ స్కూల్ భరిస్తే, రంపచోడవరం ఐటీడిఎ పిఓ రూ.23.5 లక్షల ఆర్థిక సాయం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. - ఎస్.సత్యబాబు -
టిప్పర్ ఢీకొని ఎస్సై దుర్మరణం
కాకినాడ క్రైం : విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తు చేసేందుకు వెళ్లి, మోటార్‌బైక్‌పై తిరిగిగొస్తున్న ఎస్సై ఆనంద్‌కుమార్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం హనుమాన్ నగర్‌కు చెందిన రాచర్ల ఆనంద్‌కుమార్(38) ఎస్సైగా 2002 బ్యాచ్‌లో ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన ఆయన కొంతకాలం అక్కడే విధులు నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రొబెషనరీ ఎస్సైగా ఐదు నెలల పాటు పనిచేశారు. అనంతరం ఉప్పలగుప్తం ఎస్సైగా రెండేళ్లు, విజయవాడ టూ టౌన్ ఎస్సైగా ఎక్కువ కాలం పనిచేశారు. మూడు నెలల క్రితం కోరంగి ఎస్సైగా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాకినాడ సురేష్‌నగర్ పార్కు ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఆయన మోటార్ బైక్‌పై మరో ప్రాంతానికి వెళ్లారు. అర్థరాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, సామర్లకోట రూరల్ మండలం కొప్పవరం జంక్షన్ వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది. ఎస్సై ఆనంద్‌కుమార్ పొట్టపై నుంచి టిప్పర్ చక్రాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనతో పాటు చందమామ రెస్టారెంట్ రాజు కూడా మోటార్ బైక్‌పై ఉన్నారు. ప్రమాదంలో రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తిమ్మాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆనంద్‌కుమార్‌కు భార్య ఝాన్సీలక్ష్మి, తొమ్మిదేళ్ల కుమార్తె సంజన, నాలుగేళ్ల కుమారుడు రిషీ ఉన్నారు. ఎస్సై ఆనంద్‌కుమార్ భౌతికకాయాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం. రవిప్రకాష్, ఇతర అధికారులు సందర్శించి నివాళులర్పించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆనంద్‌కుమార్ స్వగ్రామానికి తరలించారు. ఎస్సై మృతితో విషాదఛాయలు తాళ్లరేవు : కోరంగి ఎస్సై రాచర్ల ఆనంద్ కుమార్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ మూడేళ్ల పాటు ఎస్సైగా విశేష సేవలందించిన ఆనంద్‌కుమార్ సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పలగుప్తం మండలంలోరెండున్నరేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న కోరంగి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. కేవలం రెండున్నర నెలల్లోనే అక్రమ వ్యాపారాలను, నేరాల సంఖ్యను అదుపు చేశారు. అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. ఇంతలోనే ఆయన మరణించడాన్ని ప్రజలు, సహచర సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి అనేక మంది అధికారులు, నాయకులు, సహచరులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆనంద్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. పదోన్నతి రాకుండానే.. మరో రెండు నెలల్లో ఆనంద్‌కుమార్‌కు సీఐగా పదోన్నతి రానున్నట్టు ఇటీవల తెలిసింది. పదోన్నతి అందుకోకుండానే ఆయన మరణించడంతో స్టేషన్ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పోలీస్‌స్టేషన్‌కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టేషన్‌కు సమీపంలోని సురేష్ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కోరంగి సొసైటీ అధ్యక్షుడు కొప్పిశెట్టి లక్ష్మయ్య ఇంట్లో వెళ్లేందుకు రెండు రోజుల క్రితం పాలు పొంగించారు. విధి నిర్వహణే ఊపిరిగా ఆనంద్‌కుమార్ ఉండేవారని కానిస్టేబుల్ శ్రీను చెప్పారు. నిరంతరం స్టేషన్లో అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి అత్యధిక సమయం కేటాయించేవారన్నారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే నేరాలను అదుపు చేశారని సుంకరపాలేనికి చెందిన చీకట్ల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నారన్నారు. -
కిడ్స్@సూపర్ 6
సూపర్ థర్టీ... మెరికల్లాంటి 30 మంది పేద, గ్రామీణ విద్యార్థులను ఐఐటీ ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు ‘రామానుజం స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్’ రూపొందించిన ఫార్ములా. ఆ ఫార్ములా ఆవిష్కర్త ఆనంద్‌కుమార్. ఆ స్ఫూర్తితో రూపొందించిందే మన రాష్ట్రంలోని సూపర్‌సిక్స్. దీని రూపకర్త విజ్ఞాన్ సంస్థ. ప్రతిభావంతులైన ఆరుగురు పల్లెటూరి పిల్లలకు ఉచిత విద్యనందించి, వారి కలల్ని నిజం చేసేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం! ఆ వివరాలు... ‘సూపర్ సిక్స్ ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్వరకూ ఒక్కో క్లాస్‌కు ఆరుగురు చొప్పున ఎంపిక చేస్తున్నాం. తరగతిలో మొదటి ఆరుగురి పేర్లు సూపర్ సిక్స్ వారివే ఉండాలన్నది మా సంస్థ ఆలోచన’ అని చెబుతున్నారు విజ్ఞాన్ వైస్ ఛైర్పర్సన్ రాణి రుద్రమదేవి. ఐదు తరగతులకు 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు శశాంక్. మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ సామాన్య రైతు కొమరయ్య కొడుకు. ‘మేం పేదవాళ్లమే కావొచ్చు. అలాగని మా పిల్లాడికి ఉచితంగా విద్యను ఇవ్వమని చెప్పను. నా బిడ్డ ప్రతిభను చూసే చదువు చెప్పమని కోరుకుంటున్నాను. తెలివితేటలను గుర్తించి ఉచిత విద్యనందించబోతున్న సూపర్ సిక్స్‌లో మా అబ్బాయికి చోటు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అంటున్నాడు కొమరయ్య. ‘ప్రస్తుతం మేం మా ఊళ్లకి సెలబ్రెటీలుగా మారిపోయాం. మేం చదువుతున్న ప్రభుత్వ పాఠశాల టీచర్లుసైతం మమ్మల్ని పొగుడుతున్నారు. బాగా చదివి మా ఊరు, తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనేదే లక్ష్యం’ అని ధీమాగా చెబుతున్నాడు శశాంక్. అందరి బాధ్యత... అయితే ఒక్క విజ్ఞాన్కే కాదు... ప్రతిభ గల పేదవిద్యార్థులకు ఆదుకునే బాధ్యత అన్ని కార్పొరేట్ పాఠశాలలకూ ఉందంటారు మరో సూపర్‌సిక్స్ కిడ్ మనోజ్ తండ్రి శంకర్. ‘పట్టణాలకు దూరంగా, పేదరికానికి దగ్గరగా ఉండే మాలాంటి వారికి ఈ కార్యక్రమం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్న నా బిడ్డ కల నెరవేరాలి’ అని చెబుతున్నాడు ఆయన. అద్భుతమైన స్పందన... ప్రస్తుతం ఈ ‘సూపర్ సిక్స్’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. గత నెల 22న ఆరు జిల్లాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మూడు వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారు. తుది దశలో 24 మంది విద్యార్థుల్ని సూపర్సిక్స్కి ఎంపిక చేశారు. ‘ఈ కార్యక్రమం ఏటా ఉంటుంది. జిల్లాల్లో నిర్వహించిన సూపర్‌సిక్స్ పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ సందర్భంగా ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ‘సూపర్ సిక్స్‌లో అవకాశం వచ్చినా, రాకపోయినా... మా పిల్లల తెలివితేటలను అంచనా వేసే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది’ అని నాతో చెప్పారు. ఆనందించాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. కార్పొరేట్ విద్యంతా నగరాలకే పరిమితమైపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పల్లెల్లో ఉన్న ప్రతిభంతా అక్కడికే పరిమితమైపోతుంది. మా ‘సూపర్ సిక్స్’ ఆ లోటుని కొంతైనా భర్తీ చేస్తుందని ఆశిస్తున్నాం’ అని అంటున్నారామె. ఒకరినిమించి ఒకరు... ధృతిమ అనే నల్గొండ జిల్లా విద్యార్థిని లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, అదే జిల్లాకి చెందిన మధుకర్‌రెడ్డి ఐఎఎస్ అవ్వాలనుకుంటున్నాడు. నిఖిల్‌సాయి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాడు. రిషిత డాక్టర్ చదవాలనుకుంటోంది. వరంగల్ జిల్లాకి చెందిన రాకేష్ సైంటిస్ట్ అవ్వాలని కలలు కంటున్నాడు. సూపర్ సిక్స్‌లోని 24 మందిలో ఎవర్ని పలకరించినా... భవిష్యత్‌పై కోటి ఆశలతో, తమపై కొండంత విశ్వాసంతో ఉన్నారు. ‘ఒకే ఒక్క చాన్స్ ఇది. దీన్ని మేం మిస్ చేసుకోం. ఏటా టాప్ సిక్స్‌లో ఉంటూ మా కలల్ని నెరవేర్చుకోడానికి పట్టుదలతో కష్టపడతాం’ అని చెబుతున్నాడు నిఖిల్‌సాయి. సంస్థ కృషి ఫలించాలని, విద్యార్థుల కలలు సాకారం కావాలని ఆశిద్దాం! ..:: భువనేశ్వరి -
‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం
మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు కన్నడ సంప్రదాయలో సన్మానం ఉన్నతచదువులకు సాయం చేస్తామన్న ప్రవాసాంధ్రులు బెంగళూరు : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తెలుగు తేజాలు పూర్ణ (15), ఆనంద్ కుమార్ (18)లకు ఇక్కడి జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్దం నారయ్య అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లను కర్ణాటక సాంప్రదాయం ప్రకారం శాలువా, మైసూరు పేటతో సత్కరించి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమానికి పలు తెలుగు ప్రముఖులతో పాటు ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాలవత్పూర్ణ, ఆనంద్ మాట్లాడుతూ తాము ఈ సన్మానాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమాని హాజరైన మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... మైనస్ 30 డిగ్రీలు ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం దేశానికి వారు గర్వకారణమని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ఐపీఎస్ అధికారి తూకివాకం సునీల్ కుమార్ మాట్లాడుతూ విజేతలు భవిష్యత్తులో ఐపీఎస్ చదువుతామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ. రాధకృష్ణరాజు మాట్లాడుతూ... పూర్ణ, ఆనంద్ కుమార్‌లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ ఎవరెస్ట్ విజేతలకు ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 5,116 చొప్పున అందజేశారు. కార్యక్రమానికి బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రమేష్, ఐఆర్ఎస్ అధికారిణి చంద్రిక, లోకాయుక్త డీఎస్పీ నారాయణ, ఎవరెస్ట్ విద్యార్థుల కోచ్ శేఖర్‌బాబుతో పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిద్దం నారయ్య, పత్తిపాటి ఆంజనేయులు, హెచ్ఏఎల్ తెలుగు సాహిత్య సమితి అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు తదితరులు మాట్లాడారు. అంతకు ముందు కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనంతమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు బీ.కుపేంద్రరెడ్డి రూ. 50 వేలు, చామరాజపేట శాసన సభ్యుడు ఆర్.వీ. దేవరాజ్ రూ. 50 వేలు చొప్పున మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లకు అందించారని డీఎస్పీ నారాయణ తెలిపారు. తెలంగాణ శిఖరాలు : తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన అమానత్పూర్ణ, ఖమ్మం జిల్లా ధర్మమండలం సమీపంలోకి కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్‌లు తొమ్మిది నెలల పాటు డార్జిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇదే ఏడాది మే 25న వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
సమాచారం ఇవ్వకపోతే జరిమానా
ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అనంతపురం సప్తగిరి సర్కిల్:సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే వ్యక్తిగతంగా చేతి నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో స మాచార హక్కు చట్టం రాష్ట్ర కమిటీ సభ్యులు చలపతి, మఠం ఆనంద్‌కుమార్‌లతో కలిసి సమాచార హక్కు చట్టంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ చాలా మంది అధికారులకు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తును బుర్ర పెట్టి చదివే ఓపిక లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తు దారుడు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో పీఐఓ, అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. గతంలో పాడేర్ సబ్‌కలెక్టర్‌గా ఉండి(ప్రస్తుతం రిటైర్డ్ అయిన) ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు పెన్షన్ ఆపిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(ఏపీఐఓ) పేర్లు, ఫోన్ నంబర్లతో సమాచార బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఆయా డిపార్ట్మెంట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో బోర్డు ఏర్పాటు చేయలేదని సమాచార హక్కు కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. 67 శాఖలకు గాను 32 శాఖలు సమాచారం అప్లోడ్ చేయలేదని డీఆర్వో హేమసాగర్ ఇన్చార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రంలోగా ఫిర్యాదులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి సోమవారం ప్రజావాణికి రిజిష్టర్‌లో నమోదు చేసుకుని తీసుకురావాలని డీఆర్వో సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, పట్టుపరిశ్రమ జేడీ అరుణకుమారి, డీఈఓ మధుసూధన్‌రావు, అనంతపురం ఆర్డీఓ హుస్సేన్‌సాబ్, తదితరులు పాల్గొన్నారు. మసీదుల్లో మౌలిక సౌకర్యాలకు చర్యలు: పవిత్ర రంజాన్ మాసంను దృష్టిలో ఉంచుకుని మసీదుల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మున్సిపల్, పోలీస్, మైనార్టీ, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మసీదుల వద్ద తాగునీటిసౌకర్యం, పా రిశుద్ధ్యం, పోలీసు గస్తీ, షెహరీ, ఇఫ్తార్ వేళల్లో విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్మిక శాఖ అధికారులు మసీదుల వద్ద పండ్ల వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకేనేందుకు అనుమతివ్వాలన్నారు. సమావేశంలో డీఆర్వో హేమసాగర్, డీఎస్ఓ ఉమామహేశ్వర్రావు, మైనార్టీ కార్పొరేషన్ , మైనార్టీ సంక్షేమాధికారి, పుట్టపర్తి, గుత్తి, క ళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఆధార్ సీడింగ్‌పై అలసత్వం వహిస్తే చర్యలు : రేషన్‌కార్డులకు, ఉపాధి హామీ పెన్షన్లకు ఆధార్ సీడింగ్ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ, డ్వామా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రేషన్‌కార్డుల అనుసంధానం వచ్చే వారానికి 75 శాతం పైబడి లక్ష్య సాధన ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు జిల్లాలో ప్రజావాణిలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం తగదని ఇన్చార్జ్ కలెక్టర్ గురువారం ప్రజావాణి సమీక్షలో అధికారులకు సూచించారు. ఏ కేటగిరిలో 15 రోజుల్లోగా డిస్పోజల్ చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 అర్జీల కంటే ఎక్కువగా పెండిం గ్లో ఉన్న శాఖల వారీగా సమీక్షించారు. ప్రతి వారం ప్రజావాణికి వచ్చే ముందు ఎన్ని అర్జీలు పరిష్కారమయ్యాయి,ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు.