సెల్ లేదు... విల్ ఉంది...
స్ఫూర్తి
ఆ ఊర్లో ఉండే కుటుంబాల సంఖ్య 150కి మించ దు. కరెంటొచ్చి ఆరేళ్లయింది. ఇప్పటికీ సెల్‌ఫోన్‌లో కబుర్లు చెప్పుకునే చాన్స్ లేదు. ఎందుకంటే 50 కి.మీ దూరం వెళితేగాని సిగ్నల్స్ లేవు మరి. ఇంతగా వెనుకబడిన మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఊర్లో లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటూ కూర్చోలేదు. అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో తమ చిన్న ఊరి ప్రతిష్టను కొండంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన భద్రయ్య... తలచుకుంటే కొండలు సైతం తలవంచుతాయని నిరూపించారు.
‘‘రెండేళ్ల క్రితం భద్రాచలం యువకుడు ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్ ఎక్కడంతో దీనిపై ఆసక్తి వచ్చింది. ఆయన దగ్గర నుంచే ఆ వివరాలను తెలుసుకున్నా’’నన్నారు ఎపి జెన్‌కోలో కాంట్రాక్ట్ ఉద్యోగి భద్రాచలం సమీపంలోని చింతూరు గ్రామవాసి భద్రయ్య. తూర్పుగోదావరిజిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రంలో రోజుకు రూ.120 వేతనం అందుకునే కాంట్రాక్ట్ ఉద్యోగి దూబి భద్రయ్య... ఎవరెస్ట్ శిఖరాధిరోహణపై ఆసక్తి చూపడమే విశేషం. ఆసక్తినే అద్వితీయ శక్తిగా మలచుకుని కొండంత ఆశయాన్ని సాధించడం మరింత గొప్ప విశేషం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను సాక్షికి ఇలా వివరించారాయన.
క్రమశిక్షణతో...కఠోరశిక్షణ...
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే ఆలోచన తర్వాత దీనికి సంబంధించి శిక్షణ కోసం ఈ సాహసయాత్రకు గత కొంతకాలంగా మార్గదర్శకత్వం చేస్తున్న శేఖర్‌బాబును కలిశాను. ఆయన నాకు అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఫిట్‌నెస్‌ను నిర్ధారించుకున్నారు. జులైలో నన్ను ఎంపిక చేశారు. అత్యంత శీతల వాతావరణాన్ని నా శరీరం తట్టుకుంటుందా లేదా అనే పరిశీలన కూడా చేశారు. అనంతరం సిక్కిం, హిమాలయాల్లో శిక్షణ. అది నవంబరు నెల వరకూ సాగింది. అదైపోయాక భువనగిరిలో సాంకేతిక అంశాలపై 3నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం, నా గుర్తింపు కార్డులన్నీ తెలంగాణకు చెందినవి కావడంతో పాస్‌పోర్ట్ జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంత కష్టపడిందీ వృధా పోతుందేమో అని భయపడినా... జిల్లా కలెక్టర్, స్థానిక ఐటీడిఎ పిఓల సహకారంతో ఈ సమస్య పరిష్కారమైంది.
సాహసయాత్రకు శ్రీకారం...
అన్ని బాలారిష్టాలు అధిగమించాక... ఏప్రిల్7న సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి ఖాట్మండు అనంతరం సిసలైన కఠిన పరీక్షకు సిద్ధం అయ్యాను. గత ఏడాది తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ఖాట్మండు నుంచి కొడారి వెళ్లే దారి సైతం దెబ్బతింది. నేపాల్ చైనాల మధ్య వంతెన పాడైపోయింది. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లలేక విమానంలో లాసా వరకు వెళ్లాను. లాసా నుంచి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ 800కి.మీ దూరం ఉంటుంది. నేరుగా వెళితే రెండ్రోజులు పడుతుంది. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు దేహం అనువుగా మారేందుకు ఈ దూరం ఉపకరిస్తుంది. అక్కడక్కడ ఆగుతూ లాసా నుంచి బేస్ క్యాంప్‌కు చేరడానికి 7 రోజులు పట్టింది. బేస్‌క్యాంప్ సముద్రమట్టానికి దాదాపు 5200కి.మీ ఎత్తులో ఉంటుంది. దీని తర్వాత 6400 కి.మీ ఎత్తులో మరో అడ్వాన్స్ బేస్ క్యాంప్ ఉంటుంది.
ఆద్యంతం ఉత్కంఠభరితం...
అత్యంత ఎత్తులో ఆక్సిజన్ అందని పరిస్థితుల మధ్య పర్వతారోహణ సాగింది. శరీరంపై 15 కిలోల బరువుతో మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ గడ్డకట్టించేస్తుంటే, విపరీతమైన వేగంతో వీచే చలిగాలులు కోసేంత పదునుగా తాకుతుంటే ఇబ్బందుల్ని మొక్కవోని పట్టుదలతో అధిగమిస్తూ ముందడుగేశా. అడుగడుగునా ఆత్మవిశ్వాసానికి సవాళ్లు ఎదురవుతాయీ పర్వతారోహణలో. ఒక్కసారి కాలు జారితే కొన్ని వేల కిలోమీటర్ల దిగువకు పడిపోతాం. ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేసి విఫలమైన వారి మృతదేహాలు అడుగుకొకటి కనపడుతూ ధైర్యానికి పరీక్ష పెట్టాయి. ఏదేమైతేనేం... సాధించాలి అనే పట్టుదల తప్ప మరే ఆలోచనను, భయాన్నీ దరిచేరనీయకుండా ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరాక... ముందుగా గుర్తొచ్చింది మా చిన్న ఊరు. ఒక మారుమూల ప్రాంతపు గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా అంత గొప్ప కలను సాకారం చేసుకోవడం కొండంత సంతృప్తిని అందించింది’’ అంటూ చెప్పారు భద్రయ్య. అత్యంత వ్యయప్రయాసలతో కూడిన ఈ యాత్రకు శిక్షణా ఖర్చుల్ని శేఖర్‌బాబు సారథ్యంలోని రాక్‌క్లైంబింగ్ స్కూల్ భరిస్తే, రంపచోడవరం ఐటీడిఎ పిఓ రూ.23.5 లక్షల ఆర్థిక సాయం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
- ఎస్.సత్యబాబు