ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్ డిస్మిస్
సాక్షి, గుంటూరు/నూజివీడు, న్యూస్‌లైన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దక్షిణ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ వై.రంగనాథ్‌గౌడ్‌ను విధుల నుంచి తప్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగనాథ్ గతంలో గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసుస్టేషన్ ఎస్‌ఐగా పనిచేసిన సమయంలో విద్యార్థిని రజియా సుల్తానాతో ప్రేమ వ్యవహారం నడిపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే.
అప్పట్లో బాధితురాలు ప్రజా, మహిళా సంఘాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ఎస్‌ఐని సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి సస్పెన్షన్ ఎత్తివేయించుకోగా, రజియా మరోమారు అప్పటి ఐజీని, మానవ హక్కుల కమిషనర్‌ను ఆశ్రయించారు. మరో అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై హైదరాబాద్‌లో ధర్నాకు దిగి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ కూడా విచారణ చేయించారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు డీఎస్పీ జాషువా గత వారంలో జరిపిన విచారణలో రంగనాథ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ రుజువయ్యాయని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మళ్లీ హైకోర్టు జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ స్టేను ఎత్తివేయగా ఎట్టకేలకు విచారణ పూర్తయింది. దీంతో రంగనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తప్పిస్తూ రేంజ్ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు.
శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం: రజియా సుల్తానా
ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తనకు సగం న్యాయం మాత్రమే జరిగిందని, కోర్టులో శిక్ష పడినప్పుడే పూర్తిగా న్యాయం జరిగినట్టవుతుందని బాధితురాలు రజియాసుల్తానా పేర్కొన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నానని, చంపేస్తానని బెదిరింపులు కూడా ఖాతరు చేయలేదన్నారు. రూ.10లక్షలు, ఉద్యోగం ఇస్తానని ఆశపెట్టినా రాజీకి ఒప్పుకునేది లేదన్నారు.