ప్రియుడి కోసం..
పత్తాలేని యువకుడి కుటుంబ సభ్యులు
సుందరాడ(తెర్లాం రూరల్) : ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని కోరుతూ సుందరాడ గ్రామానికి చెందిన పద్మ చేపట్టిన మౌనదీక్ష సోమవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందరాడ గ్రామానికి చెందిన పద్మ, అదే గ్రామానికి చెందిన శివాజీ ప్రేమించుకున్నారు. అయితే పద్మకు ఆమె తల్లిదండ్రులు పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహం చేశారు. వివాహ అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులు పోయిన తర్వాత శివాజీ హైదరాబాద్ వెళ్లి పద్మతో మళ్లీ పరిచయం పెంచుకున్నాడు.
భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇదే విషయం పద్మ తన భర్తకు తెలియజేయడంతో ఇరువురు గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అయితే ఇంతవరకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన శివాజీ ప్రస్తుతం ముఖం చాటేశాడు. దీంతో పద్మ మళ్లీ పెద్దమనుషుల సమక్షంలో పంచారుుతీ పెట్టినా శివాజీ పెళ్లికి నిరాకరించడంతో ఈ నెల 13వ తేదీ నుంచి అతని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తోంది. ఇదిలా ఉంటే పద్మ మౌనదీక్ష చేపట్టినప్పటినుంచే శివాజీ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.