సాక్షి, విజయవాడ : బెజవాడ దుర్గమ్మ గుడిలో అమ్మవారి పట్టు చీర మాయమైన ఘటనపై విచారణ జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఛైర్మన్ గౌరంగ బాబు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకోలేదన్నారు. చీర ఎటుపోయిందో తామే తెలుస్తామని, విచారణ కోసం నియమించే కమిటీలో పాలకుల మండిలి సభ్యులే ఉంటారని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. ఇక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదన్న మీడియా ప్రశ్నలకు ఛైర్మన్ మాటదాటవేశారు. విచారణ కమిటీలో పాలకులే ఉంటారన్న ఛైర్మన్ వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారి పట్టుచీర ఎక్కడ?..
ఉండవల్లి భక్తులు దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా చీర విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లిలో ఎంతో భక్తితో నేయించి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర కనిపించకపోవటంపై సమర్పకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఆలయ ఈవో నుంచి ఎలాంటి సమాధానం లేదని లలిత భక్తమండలి వాపోయింది.
ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతనే చీరను తీసుకున్నారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఉండవల్లి నుంచి అమ్మవారి సారె ఇవ్వడానికి వచ్చిన వారికి తనే స్వాగతం పలికానని, కానీ వేణుగోపాల స్వామికి చెందిన భక్తులు ఇచ్చిన చీరను మాత్రమే తను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పాలకమండలి సభ్యురాలిని కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని, చీర తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. మరోవైపు సూర్యలతే కవర్‌లో పెట్టి చీర పట్టుకెళ్లడం చూశానని దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య తెలిపారు. సూర్యలతకు తనకు ఎలాంటి విభేదాలు లేవని చూసిందే చెబుతున్నానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment