
తెలుగువారికి గర్వకారణం సింధు
ఒలింపిక్స్‌లో దేశం పరువు కాపాడిన సింధు తెలుగువారందరికీ అత్యంత గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సింధు, గోపీచంద్, శ్రీకాంత్ తదితరులకు ఘనంగా సన్మానం
విజయవాడ స్పోర్ట్స్: ఒలింపిక్స్‌లో దేశం పరువు కాపాడిన సింధు తెలుగువారందరికీ అత్యంత గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశ క్రీడా రంగానికి వైభవం రావాలంటే ఒలింపిక్స్ నిర్వహణ ఒక్కటే మార్గమని తాను 2000 సంవత్సరంలో దేశ రాష్ట్రపతి, ప్రధానికి సలహా ఇచ్చినట్లు చెప్పారు. రియో ఒలింపిక్స్ సిల్వర్ స్టార్ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, ట్రిపుల్ ఒలింపియన్, శాప్ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిలను స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోనూ.. తర్వాత జరిగిన పుష్కరాల ముగింపు వేడుకల్లోనూ చంద్రబాబు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ నిర్వహణ వల్ల దేశంలో క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుందని, ప్రపంచస్థాయి క్రీడాకారులు పుట్టుకొస్తారని చెప్పారు. తమ్ముళ్లూ... అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలని కృష్ణా పుష్కరాలు సందర్భంగా సంకల్పం చేయండి... అవి నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు. సింధును ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో కోచ్ గోపీచంద్, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయల ప్రోత్సాహం వెలకట్టలేనిదన్నారు.
వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం ఖాయం..
తాను ప్రోటోకాల్ పక్కన పెట్టి సింధుకు స్వాగతం పలకడానికి ఒలింపిక్స్‌లో ఆమె సాధించిన ఘనతే కారణమని బాబు అన్నారు. చిన్నారులకు స్ఫూర్తినివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. అమరావతిలో నిర్మించే తొమ్మిది నగరాల్లో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ ఉందన్నారు. గోపీచంద్ అకాడమీ పెడితే అందులో 15 ఎకరాలు స్థలం ఇస్తామని ప్రకటించారు. విజయవాడలోనే కాకుండా విశాఖపట్నం, తిరుపతిలో కూడా స్పోర్ట్స్ సిటీలు నిర్మిస్తామని వెల్లడించారు. ఎంతోమందిని బ్యాడ్మిం టన్ స్టార్లుగా తీర్చిదిద్దుతున్న కోచ్ గోపీచంద్‌కు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.
సింధుకు ఘనస్వాగతం
అంతకుముందు పీవీ సింధుకు విజయవాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉదయం సింధు విజయోత్సవ సభ మున్సిపల్ స్టేడియంలో జరిగింది. చంద్రబాబు స్వయంగా స్టేడియం మెయిన్ గేటు వద్దకు వెళ్లి ఘన స్వాగతం పలికి వేదికపైకి తోడ్కోని వచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు రెండు షటిల్ బ్యాట్‌లు తీసుకొచ్చి సీఎంకు, సింధుకి ఇచ్చి వేదికపై బ్యాడ్మింటన్ ఆడించారు. అటు పుష్కరాల ముగింపునకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, గణపతి సచ్చిదానందస్వామిజీ, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ముందుగా సీఎం దంపతులు, కేంద్ర మంత్రులు సింధును సన్మానించారు. మూడు కోట్ల చెక్‌ను, అభినందన పత్రాన్ని అందజేశారు. తరువాత కోచ్ గోపీచంద్‌కు రూ. 50 లక్షల చెక్, క్రీడాకారుడు కె.శ్రీకాంత్‌కు రూ. 25 లక్షలు చెక్‌ను అందజేశారు. సింధు వచ్చే ఒలంపిక్స్‌లో స్వర్ణ సింధుగా రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. సింధు అందించిన స్ఫూర్తిని క్రీడల్లో కొనసాగిస్తామని సురేష్ ప్రభు చెప్పారు.