
500 ఏళ్ల సమాచారాన్ని కోరిన సింగపూర్ బృందం
రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి చెందిన సమాచారాన్ని సింగపూర్ బృందానికి ఇచ్చినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి చెందిన సమాచారాన్ని సింగపూర్ బృందానికి ఇచ్చినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దాదాపు 500 సంవత్సరాల సమాచారాన్ని సింగపూర్ బృందం కోరిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్నసమాచారాన్ని ఇచ్చామని చెప్పారు. వివిధ ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సింగపూర్ బృందం సమావేశమైందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్ నగరాన్ని పరిశీలించారని వివరించారు.
వారం రోజుల్లో మాస్టర్ ప్లాన్పై యాక్షన్ ప్లాన్ ఇస్తామన్నారని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారని నారాయణ చెప్పారు. చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్లే ఉచితంగా సేవలు అందిస్తున్నారన్నారు. ఉచిత సర్వీసు గనక ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని తెలిపారు. జనవరి 19 నుంచి 23వ తేదీ వరకు సింగపూర్లో ఏపీ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని, ఇందుకు 33 మంది అధికారులను ఎంపికచేసి పంపిస్తామని అన్నారు. ఆరు వారాల్లో ఓ ప్రణాళికను రూపొందిస్తామని సింగపూర్ బృందం చెప్పిందని ఆయన తెలిపారు.