సాక్షి, మంచిర్యాల: సింగరేణి.. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లనేల.. జిల్లాలో పదిహేను భూగర్భగనులు, నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు బొగ్గులో కలిసి ‘పోతున్నారు’. మరికొందరు గాయాలపాలై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. గనిలోకి వెళ్లిన కార్మికుడు ఇంటికి తిరిగొస్తాడో లేదో తెలియని పరిస్థితి. ప్రకృతికి విరుద్ధంగా భూమి పొరల్లో వందల మీటర్ల దూరంలో బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికుడికి ఏ రూపంలో విపత్తు ముంచుకొస్తుందో తెలియదు. కార్మికుడు ఇంటికొచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఒకటే ఉత్కంఠ.
కార్మికుల జీవితాలతో చెలగాటం
సింగరేణి యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉత్పత్తే లక్ష్యంగా కార్మికులపై ఒత్తిడి తెస్తూ వారి ప్రాణాలు బలిగొంటోంది. ఏటా చాలామంది కార్మికులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. మరెన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి కోసం టెక్నాలజీ పెంపొందిస్తుందే తప్ప కార్మికుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేక పోతోంది. ప్రమాదాలు పసిగట్టే యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం సింగరేణిలో లేదు. భూగర్భంలో సెకనుకోసారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. పైకప్పు కూలడం, సైడ్‌ఫాల్, విష వాయువులు, నీటి గండాలు కార్మికులను చంపేస్తుంటాయి. వీటిని పసిగట్టే యంత్రాలు ఉంటే కొంతవరకైనా ప్రమాదాలు తగ్గించవచ్చు.
అమలుకాని డీజీఎంఎస్ నిబంధనలు
గనుల్లో ప్రమాదాల నివారణ చర్యలకు ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ నిబంధన ప్రకారం నిర్వహించాల్సిన కార్పొరేట్ సేఫ్టీ ట్రై పార్టీయేట్ సమావేశం ఏడాదిగా జాడలేదు. 1981 నుంచి 2013 వరకు అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలంలో జిల్లాలోని భూగర్భ గనుల్లో 8,260 మంది కార్మికులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది జనవరి 11న శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఆర్కే న్యూటెక్‌గనిలో పైకప్పు కూలి కోల్‌కట్టర్ కోతయ్య(56), కోల్‌పిల్లర్ నేరళ్ల సతీశ్(33) మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రతిసారి కార్మికులు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. రక్షణ కల్పిస్తామని అధికారులు హామిలిస్తూనే ఉన్నారు. అయినా గని ప్రమాదాలు ఆగడం లేదు.
రక్షణ చర్యలపై చిత్తశుద్ధి కరువు
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టడంలో సింగరేణి విఫలమవుతోంది. రిస్క్ పనిస్థలాల్లో రూప్ సపోర్టు చేయాలి. పనిస్థలాన్ని మూసివేయాలి. ఒకవేళ పని చేయాల్సి ఉంటే సరిపడా మ్యాన్ పవర్ ఏర్పాటు చేయాలి. మైన్ యాక్ట్ ప్రకారం.. సరైన సూపర్‌వైజింగ్‌లో పనిచేయాలి. కానీ, సింగరేణిలో సుమారు 500 మంది సూపర్‌వైజర్లు అవసరమున్నారు. ఏటా ఉత్పత్తి లక్ష్యం భారీగా నిర్ణయిస్తూ కార్మికులపై పనిభారం మోపుతోంది. నిబంధనల ప్రకారం.. కేవలం మూడు షిఫ్టులు ఉండాలి. అధిక ఉత్పత్తి, మెయింటెన్స్ పేరుతో ఐదు షిఫ్టులు పెడుతోంది. పని ఒత్తిడి పెరగడంతో కార్మికులు స్వీయరక్షణపై దృష్టిసారించలేక పోతున్నారు.
కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌కు విరుద్ధంగా ఉత్పత్తి
కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌కు విరుద్ధంగా అధిక ఉత్పత్తి కోసం యాజమాన్యం పనిచేయిస్తోంది. ఇందుకోసం అధికారులు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. ఏదైన ప్రమాదం జరిగినపుడు ఎందుకు చేశారంటూ కిందిస్థాయి సూపర్‌వైజర్లు కార్మికులకు చార్జిషీట్లు, సస్పెండ్ చేస్తు వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే.. ఎక్కడైన రైల్వే ప్రమాదం జరిగితే కిందిస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరిపై చర్యలు తీసుకుంటారు. అదే తరహాలో సింగరేణిలోనూ అమలు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు షిఫ్టులో ఉన్న సేఫ్టీ రిపోర్టులను తరువాత షిఫ్టులో పరిగణలోకి తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉండగా దాన్ని పూర్తిస్థాయి లో అమలు చేయడం లేదు. అలాగే సేఫ్టీ సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఉత్పత్తి వేటలో కార్మికుల ప్రాణాలను పట్టించుకోకుండా సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు కల్పించకుండా పని చేయిస్తుండటంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధినపడుతున్న కుటుంబాలు
గని ప్రమాదాల్లో సింగరేణి కార్మికులు చనిపోతే యాజమాన్యం నష్టపరిహారం, అవసరమైతే ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇచ్చే డబ్బులు కూడా కార్మికుని జీతం నుంచి కట్ చేసుకున్నవే అని యాజమాన్యం గుర్తించాలి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం వీధిపాలవుతుందని గ్రహించడం లేదు. డబ్బులు, ఉద్యోగం పోయిన కుటుంబ పెద్దను తెచ్చివ్వలేదు కదా అన్న విషయాన్ని గుర్తించాలి.
మృత్యుగనులు
Published Sat, Jan 18 2014 4:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement