- ఉలవపాడుకు చెందిన వెంకయ్య మరికొందరితో కలిసి సంస్థ ఏర్పాటు
- ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో డిపాజిట్ల రూపంలో రూ.150 కోట్లు వసూలు
- ఐదు రోజుల కిందట నెల్లూరులో సంస్థ ఎండీ అరెస్ట్
- బోర్డు తిప్పేయడంతో బాధిత ప్రజలు లబోదిబో
- న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు
ఒంగోలు క్రైం : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో డిపాజిట్లు వసూలు చేసి వాటితో జల్సాలు చేసి చివరకు జనాన్ని నిలువునా ముంచిన సిరి గోల్డ్ సంస్థ బాగోతం వెలుగు చూసింది. ఈ సంస్థ సూత్రధారి ఉలవపాడు మండలం కరేడుకు చెందిన మర్రిబోయిన వెంకయ్య. నెల్లూరుకు చెందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యజమానితో మరో ఐదుగురిని డెరైక్టర్లను కలుపుకుని వెంకయ్య ఈ సంస్థను స్థాపించాడు.
కర్ణాటకలోని మైసూరు, గుల్బర్గా పట్టణాలతోపాటు జిల్లాలోని ఒంగోలు, కందుకూరులలో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. ప్రజల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. నెల్లూరులో ఇచ్చిన చెక్‌లు బౌన్స కావడం.. సంస్థ కార్యాలయం మూసివేయడంతో తొలుత అక్కడి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదు.లాభంలేదనుకుని బాధితులే ఏకమై ఐదు రోజుల కిందట నెల్లూరులో ఉన్న సంస్థ ఎండీ సుందరాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో విషయం రచ్చయింది.
వసూలు చేసిన డబ్బుతో జల్సాలు
వసూలు చేసిన డబ్బుతో సంస్థ నిర్వాహకులు కొంత మొత్తంతో జల్సాలు చేయగా, మరి కొంతతో బినామీ పేర్ల మీద స్థిరాస్తులు కొనుగోలు చే శారు. తూతూమంత్రంగా తక్కువ ధరకు పనికి రాని పొలాలను కొని సంస్థ పేరు మీద పెట్టారు. జిల్లాలోని కనిగిరి, సీఎస్‌పురం, పీసీపల్లి, దొనకొండ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలోని ఈదుమూడి, బోగోలు బిట్రగుంట, వింజమూరు, ఆత్మకూరు, సంఘం ప్రాంతాల్లో ఈ సంస్థ పేరు మీద పొలాలున్నాయి. ఖరీదైన భవనాలు, స్థలాలు, నెల్లూరు, విశాఖపట్నం, బెంగళూరు లాంటి నగరాల్లో సంస్థ నిర్వాహకుల భార్యలు, కుటుంబ సభ్యులు, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళల పేర్ల మీద కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం.
ఒక్కో నెలలో రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు డ్రా
సంస్థలో పని చేస్తున్న దాదాపు ఐదుగురు డెరైక్టర్లలో ఒక్కొక్కరు ఒక్కో నెలలో రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు బ్యాంకుల నుంచి సొంతానికి డ్రా చేశారు. ఆ డబ్బుతో విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేశారు. ఒంగోలులో బ్రాంచి మేనేజర్‌గా ఉన్న ఓ మహిళ రూ.4 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. ఓ డెరైక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె అందినకాడికి నొక్కేసింది.
డెరైక్టర్ వెంకయ్య ప్రస్థానం...
ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సాధారణ వ్యక్తిగా ఉన్న మర్రిబోయిన వెంకయ్య తొలుత అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. సంస్థ కార్యకలాపాలు, లావాదేవీలను ఔపోసన పట్టిన ఆయన సింగరాయకొండకు చెందిన మరికొందరిని కలుపుకొని అక్షయ గోల్డ్ అనే సంస్థను స్థాపించి అనతికాలంలోనే ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సంస్థ డెరైక్టర్ల మధ్య విభేదాలు రావడంతో వెంకయ్య తన వాటాను తీసుకొని బయటకొచ్చాడు.
అనంతరం మరికొందరితో కలిసి జీ-9 అనే సంస్థను స్థాపించి డిపాజిట్ల వసూలు కార్యక్రమం చేపట్టారు. అక్కడా విభేదాలు రావడంతో బయటకొచ్చాడు. అనంతరం నెల్లూరులో అతని సామాజిక వర్గానికే చెందిన ఇంజినీరింగ్ కళాశాలల యజమానితో కుమ్మక్కై సిరిగోల్డ్ సంస్థను స్థాపించాడు. సంస్థకు చెందిన వ్యాపార ప్రచార కార్యక్రమాలు గానీ, ప్రజలకు గ్యారంటీ ఇవ్వడంలో గానీ, ఆ ఇంజినీరింగ్ కళాశాలల యజమానినే ముందుంచి గొలుసుకట్టు వ్యాపారాన్ని ముందుకు నడిపించాడు.
అయితే సంస్థ డెరైక్టర్లలో కళాశాలల యజమాని పేరు ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తమ్మీద జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లాది రూపాయలు దండుకుని శఠగోపం పెట్టాడు. ప్రస్తుతం నిందితుడు వెంకయ్య ఒంగోలు బ్రాంచి కార్యాలయంలో ఓ మహిళ ఉద్యోగిని వెంటేసుకొని హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. ఐదు రోజుల కిందట విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని బాధిత ప్రజలు విమర్శిస్తున్నారు.
‘సిరిగోల్డ్’ సూత్రధారి జిల్లావాసే
Published Thu, Jul 17 2014 3:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement