వేర్వేరు చోట్లే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం
ఏపీ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. రాజధానికి కావలసిన ప్రదేశం, అభివృద్ధి వికేంద్రీకరణ, శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఏర్పాటులతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ సూచనలిచ్చింది. రాజధాని కోసం వ్యవసాయ భూములు వినియోగించద్దని తన నివేదికలో పేర్కొంది. పర్యటనల ద్వారా సేకరించిన సమాచారాన్ని 187 పేజీల నివేదికలో పొందుపరచి కేంద్ర హోంశాఖకు అందజేసింది.
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల లాంటి కీలక నిర్మాణాల ఏర్పాటు... వేరే వేరే చోట్ల జరగాలని సూచించింది. శాసనసభ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టు ఉండాలనేం లేదని ఈ సందర్భంగా గుర్తుచేసింది. పాలనపరంగా కీలకమైన సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయ ఏర్పాటుకు 20 ఎకరాలు అవసరమని శివరామకృష్ణన్ తెలిపింది. అసెంబ్లీ ఏర్పాటుకు 80 నుంచి 100 ఎకరాలు కావాల్సి ఉంటుందని పేర్కొంది. గవర్నర్ నివాసగృహం రాజ్‌భవన్ కోసం 15 ఎకరాలు కావాలని చెప్పింది. హైకోర్టు ఏర్పాటుకు విశాఖపట్నం నగరాన్ని పరిశీలించవచ్చని నివేదికలో సూచించింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాయలసీమ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు, దాని సంబంధిత వ్యవస్థ నిర్మాణానికి దాదాపు 100 నుంచి 140 ఎకరాలు అవసరమని చెప్పింది.