♦ బోగోలులో మూడు గంటలపాటు వర్షం
♦ స్తంభించిన జనజీవనం
బిట్రగుంట : బోగోలు మండలంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలపాటు కురిసిన వర్షానికి ఒక వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కొండబిట్రగుంటకు చెందిన పశువులకాపరి చల్లా వెంకయ్య (60) మృతిచెందగా, ఏనుగులబావిలో భార్య, భర్త తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు కప్పరాళ్లపల్లితిప్పలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి.
చిల్లకూరు: మండలంలోని కోరివారిపాళెంలో ఆదివారం పిడుగుపాటుకు గురై ఉప్పల పెద రమణయ్య (60) మృతిచెందారు. మధ్యాహ్నం వర్షం వచ్చే సూచనలుండటంతో చెట్టు కింద ఆగాడు. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా పిడుగుపడటంతో రమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
వరికుంటపాడు: మండలంలోని పామూరుపల్లె పంచాయతీ తొడుగుపల్లె గ్రామశివార్లలో పిడుగుపడటంతో నక్కల నాగేశ్వరరావు (45) అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
కొడవలూరు: పిడుగుపాటుతో మండలంలోని దామేగుంట మజరా కొండాయపాలెంలో ఆదివారం రాయి ప్రసాద్ (34) అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవడంతో సమీపంలోని తాటిచెట్టు కిందకు వెళ్లాడు. పిడుగుపడటంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిడుగుపాటుకు తండ్రీకొడుకు
వెంకటాచలం: ఉరుములు, మెరుపులు, పిడుగులతో గంటపాటు బీభత్సం సృష్టించిన గాలివాన తండ్రీకొడుకును బలితీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, వెంకటకృష్ణాపురానికి చెందిన సైదు వెంకటరావు (34), కుమార్ (9) పిడుగుపాటుకు గురై ఆదివారం మృతిచెందారు. వెంకటరావు వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో కండలేరు క్రీక్‌లో చేపలవేట, రొయ్యల గుంట సాగుచేస్తూ జీవనం సాగించేవాడు. వెంకటరావుకు 12 ఏళ్ల కుమార్తె రాణి, భార్య జ్యోతి ఉన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివరామలింగారెడ్డి, వీఆర్వో మురహరి, ఎస్సై వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపాటుకు ఆరుగురి మృతి
Published Mon, Sep 7 2015 3:54 AM | Last Updated on Tue, Nov 6 2018 4:38 PM
Advertisement
Advertisement