సీఎం వైఎస్‌ జగన్‌: సంక్షేమ పాలన.. | 6 Months of YS Jagan's Government - Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలన..

Published Sat, Nov 30 2019 10:24 AM | Last Updated on Sat, Nov 30 2019 11:02 AM

Six Months Of YS Jagan Mohan Reddy Govt Rule - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టి శనివారానికి సరిగ్గా ఆర్నెల్లు. ఈ ఏడాది మే 30న ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాలు అమలుకు అంకురార్పణ జరిగింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హమీలు, ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పింఛన్ల పెంపుతో మొదలైన సంక్షేమ బాట  అమ్మ ఒడి, చేనేతల లబ్ధి వరకు అన్నీ ప్రకటించిన విధంగా మేలు చేకూర్చనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చి అభివృద్ధిపై హమీలిచ్చారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో పట్టాలెక్కించే దిశగా అడుగులేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి సమస్యల వరకు అన్నింటి పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజీ పనులతో పాటు సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనుల నిర్వహణకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. వీటిలో పెన్నా బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి.

కనిగిరి రిజర్వాయర్, సర్వేపల్లి కెనాల్, అల్లూరు చెరువు అభివృద్ధి, ముదివర్తి నుంచి ముదివర్తిపాళెం వరకు వంతెన నిర్మాణం, నెల్లూరు చెరువు అభివృద్ధితో పాటు నిర్వహణ పనులు కలుపుకొని జిల్లాలో దాదాపు రూ.400 కోట్లతో జలవనరుల శాఖ పనులు పట్టాలెక్కనున్నాయి.   జిల్లాలో మత్స్యకార గ్రామాలు 118 ఉన్నాయి. జిల్లాలో మత్స్యకారులకు వేట విరామభృతి నూరు శాతం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో అర్హులైన 15,550 మంది మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున జిల్లాలో రూ.15.5 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసింది.. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండటంతో పాటు బాధితులు అగ్రిగోల్డ్‌కు చెల్లించిన డిపాజిట్లను ప్రభుత్వమే దశల వారీగా అందజేస్తుందని ప్రకటించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో రూ.10 వేల్లోపు డిపాజిట్‌ చేసిన బాధితులు 24,390 మందికి రూ.16.92 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆటో డ్రైవర్లకు వైఎస్సార్‌ వాహన మిత్ర పేరుతో మొదటి విడతలో 13,697 మందికి రూ.13.69 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చేశారు. రెండో విడత కింద 4,783 మందికి రూ.4.78 కోట్లను ఈ నెల 27న విడుదల చేశారు. ఈ మొత్తం కూడా వారి ఖాతాల్లో జమయ్యే ప్రక్రియ కొనసాగుతోంది.

జిల్లా నుంచే రైతు భరోసాకు శ్రీకారం.. 
నవరత్నాలో ఎంతో కీలకమైన వైఎస్సార్‌ రైతు భరోసాను  జిల్లా నుంచే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గత నెల 15న ప్రారంభించిన ఈ పథకం ద్వారా జిల్లాలో 1,89,595 మంది రైతులకు రూ.159.57 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో సాగు బాగా కలిసొచ్చింది. దీంతో ఖరీఫ్‌లో దాదాపు 8.5 లక్షల ఎకరాల్లో జిల్లాలో సాగు చేపట్టారు. దీనికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించడంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌కు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాకు 151 టీఎంసీల నీరు ఎగువ నుంచి రావడంతో సోమశిలలో 67.662 టీఎంసీలు, కండలేరులో 46 టీఎంసీలను నిల్వ చేశారు.

జిల్లాలో సాగునీటి అవసరాలు, చెరువులు నింపేందుకు 35 టీఎంసీల వరకు అన్ని ప్రధాన కాలువలు, ప్రధాన రిజర్వాయర్లకు విడుదల చేశారు. జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అమ్మఒడి ద్వారా జిల్లాలో 4,39,382 మందికి మేలు జరగనుంది. వీరిలో పదో తరగతిలోపు విద్యార్థులు 3,98,160 మంది కాగా, ఇంటర్‌ విద్యార్థులు 41,222 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జవనరిలో వీరందరికీ కలిపి జిల్లాలో రూ.439.38 కోట్లు పంపిణీ చేయనున్నారు. డిసెంబర్‌ 21న చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఇప్పటి వరకు 6,120 మంది నేతన్నలను ఎంపిక చేశారు. ఈ సంఖ్య మరో 300 వరకు పెరిగే అవకాశం ఉంది. వీరికి రూ.24 వేల చొప్పున అందజేయనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement