సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తానని, వారికి సంబంధించిన రహస్యాలను ఎవ్వరికీ తెలియనివ్వనని, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవ్వరికీ వెల్లడించనని’’.. దైవసాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణం అపహాస్యం పాలవుతోంది. అలాగే, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా మంత్రిగా చేసిన ప్రమాణాన్ని అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలుగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈ ఇద్దరు ఇప్పుడు దొంగలుగా మారిపోయారు. తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వారే ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఏర్పాటుచేయించిన ఐటి గ్రిడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఇప్పించేశారు. తమ ఐదేళ్ల పాలనపై తమకే నమ్మకం సడలడంతో రెండేళ్ల క్రితం నుంచే పెదబాబు, చినబాబులు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు స్కెచ్ వేశారు. (బ్లూ ఫ్రాగ్ దాగుడు‘మూత’లు)
అందులో భాగంగానే ప్రజలకు సత్వరమే సేవలు అందించే ముసుగులో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజలందరి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ప్రతీ పౌరుని పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆ కుటుంబానికి చెందిన వివరాలు, రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, పాన్/జీఎస్‌టీఎన్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ, కులం, ఆదాయం, విద్యార్థుల మార్కులు, వాహనాల వివరాలను సేకరించారు. ఆ వివరాలన్నింటితో పాటు వివిధ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ ద్వారా పీపుల్స్ హబ్ రూపొందించారు. వివిధ శాఖలకు చెందిన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సంబంధిత శాఖలు రాష్ట్రంలోని కుటుంబాల హబ్‌కు/పీపుల్స్ హబ్‌కు ఇవ్వాల్సిందిగా 2017 ఆగస్టు 31న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ జీవో–1 జారీ చేశారు. (అశోక్ ఐఫోనే అత్యంత కీలకం)
సీఎస్ ఉత్తర్వులు బేఖాతరు..
ప్రభుత్వ సేవలు అందించడానికి, లబ్ధిదారుల ఎంపికకు పీపుల్స్ హబ్ డేటాను వినియోగించుకోవాలని ఆ జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఏ కుటుంబాల వివరాలైనా పీపుల్స్ హబ్‌లో లేకపోతే వెంటనే వారి వివరాలను సేకరించి హబ్‌లో నిక్షిప్తం చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. అయితే, రాష్ట్రంలోని లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దని స్పష్టంచేస్తూ.. ఆధార్, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు, సామాజిక డేటాను ఏ శాఖ కూడా వెబ్ పోర్టల్స్‌లో ఉంచరాదని, ఎవ్వరికీ ఆ వివరాలు ఇవ్వడంగానీ పంచుకోవడంగానీ చేయరాదన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 2016 ఆధార్ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారని సీఎస్ ఆ జీవోలో స్పష్టంచేశారు. (సర్వం దోచేశారు)
డేటా చోర్.. పెదబాబు, చినబాబు
ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్‌కు రాష్ట్రంలోని కుటుంబాల వివరాలను ఇప్పించిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు అదే ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రానికి చెందిన కుటుంబాల సమస్త సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ కోసం సేవామిత్ర యాప్ రూపకల్పనకు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చేశారు. ఈ డేటా ఆధారంగానే ఇప్పుడు సర్వేలు చేస్తూ తన పార్టీకి ఓట్లు వేయని వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆన్‌లైన్‌లో లక్షల్లో ఫాం–7లను సమర్పిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్‌లో క్యాష్ ఫర్ ట్వీట్!)
ఆదిలోనే ప్రత్యేక సైన్యం ఏర్పాటు..
కాగా, ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన ఆర్టీజీఎస్‌లో చినబాబు తన సైన్యాన్ని నింపేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం కింద అందులో పెద్దఎత్తున నియామకాలను చేపట్టేశారు. ఈ నియామకాల్లో ఎక్కడా రిజర్వేషన్లు పాటించలేదు. సోషల్ మీడియాతో పాటు వివిధ రంగాల నిపుణులను నియమించారు. వారికి భారీఎత్తున వేతనాలను ఇస్తున్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా మైనింగ్, డేటా ఎనలైటిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్, క్రౌడ్ సోర్సింగ్ కో–ఆర్డినేషన్, సోషల్ మీడియా, కాల్ సెంటర్, ఈవెంట్ అండ్ ఇన్సిడెంట్ మానిటరింగ్, సోషల్ మీడియా బృందం, కమాండ్ అండ్ కంట్రోల్ వంటి విభాగాలను ఏర్పాటుచేశారు. ఏటా బడ్జెట్‌లో దీని నిర్వహణకు రూ.165 కోట్లు కేటాయిస్తున్నారు. ఇంత పెద్ద యంత్రాంగంతో నడుస్తున్న ఈ ఆర్టీజీఎస్‌లోని సమాచారాన్ని ఇప్పుడు పెదబాబు, చినబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి పార్టీ సేవామిత్ర యాప్‌కు బదిలీ చేయించేశారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఆయన కుమారుడే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ యాప్‌కు బదిలీచేస్తే ఇక ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికా రి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ డేటా స్కామ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారనే విషయం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీచేసిన జీవోను ఉల్లంఘించినందున ఆర్టీజీఎస్, ఇ–ప్రగతి బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు బాధ్యత వహిస్తారా లేదా సీఎస్ బాధ్యత వహిస్తారా లేదా సీఎం, ఐటీ శాఖ మంత్రి బాధ్యత వహిస్తారనే దానిపై చర్చ సాగుతోంది.
‘రియల్ టైమ్’తో కాజేశారు
Published Wed, Mar 6 2019 4:12 AM | Last Updated on Wed, Mar 6 2019 9:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment