తప్పించుకునే వీల్లేకుండా స్కెచ్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యకు ప్రత్యర్థులు పక్కాగా స్కెచ్ వేశారు. తప్పించుకునేందుకు ఎలాంటి వీలు లేకుండా పథకం ప్రకారం దాడి చేశారు. ఇందుకోసం 15 రోజుల నుంచి వారు అక్కడ రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. దాడికి మూడు ట్రాక్టర్లను వినియోగించారని, దాడిలో 25 మంది వరకు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాలను బట్టి తెలుస్తోంది.
స్కెచ్ వేశారిలా...!
చెరకులపాడు నుంచి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సరిగ్గా విద్యుత్ సబ్‌స్టేషన్ దాటిన తర్వాత కల్వర్టు పనులు నడుస్తున్నాయి. అక్కడ దారి ఇరుకుగా ఉంది. అక్కడ ఏ వాహనమైనా...నెమ్మదిగా వెళ్లాల్సిందే. పక్కకు వెళ్లేందుకు దారి లేదు. అక్కడ కల్వర్టు పైపులు రెండు ఉన్నాయి. ఇందులో 10 మంది వరకూ దాక్కున్నారు. ఇందులో దాక్కున్న వారు వాహనంలో వెళుతున్న వారికి కనిపించే అవకాశం లేదు. మరోవైపు బెండ తోట ఉంది. ఇక్కడ ఓ ఐదుగురు దాక్కున్నారు. కల్వర్టు దాటిన తర్వాత కుడి వైపున పొలం ఉంది. ఈ పొలం లోపల ట్రాక్టర్‌తో పనిచేయిస్తున్నట్టుగా పది మంది వరకూ ఉన్నారు. కల్వర్టు దాటిన తర్వాత మరో ట్రాక్టర్ ఆగి ఉంది. అక్కడ రోడ్డు పనులు జరుగుతుండటంతో అందుకోసమే ఉన్నట్టుగా అనుమానం రాకుండా నిలిపి ఉంచారు.
దాడి జరిగిందిలా....!
నారాయణరెడ్డి వాహనం కల్వర్టు దాటుతున్న సమయంలోనే ఆయన అనుచరులు వెళుతున్న ముందు వాహనంపై బండరాళ్లతో దాడికి దిగారు. అయితే, ఆ వాహనం వేగంగా పోలీసు స్టేషన్ వైపునకు వెళ్లింది. ఇక వెనుక నుంచి వస్తున్న నారాయణ రెడ్డి వాహనం కల్వర్టు దాటుతున్న సమయంలో వెనుక ఉన్న ట్రాక్టర్ నుంచి గట్టిగా ఢీ కొట్టారు. అదే సందర్భంలో పొలం వైపునకు వెళ్లకుండా పొలంలో ఉన్న ట్రాక్టర్‌తో ముందుకు వచ్చి మరోసారి వాహనాన్ని ఢీ కొట్టారు. ఇదే అదనుగా కల్వర్టు పైపుల్లో దాక్కున్న వారు, బెండ తోటలో దాక్కున్న వారు మూకుమ్మడిగా దాడికి దిగారు.
ట్రాక్టర్‌లలో ఉన్న వారు కూడా కత్తులు, వేటకొడవళ్లు, బండరాళ్లతో దాడికి దిగారు. వాహనం పోతున్న దారిలో ఎడమవైపున లోతైన గుంత ఉంది. ఈ గుంతలోకి వాహనం పోయేట్టుగా ముందు ట్రాక్టర్ నుంచి ఢీకొట్టారు. తద్వారా నారాయణ రెడ్డి తప్పించుకునేందుకు వీలు లేకుండా చేశారు. ఆయన వెళుతున్న ఫార్చూనర్‌కారు అద్దాలను పగలగొట్టేందుకు భారీ బండరాళ్లను వినియోగించారు. నారాయణరెడ్డిని, ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన సాంబశివుడిని హత్య చేసిన అనంతరం దుండగులు చెరకులపాడు గ్రామం వైపునకు వెళ్లిపోయారని తెలుస్తోంది.