
సాక్షి, అమరావతి: ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తూనే మరోవైపు వారికి వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నైపుణ్యాభివృద్ధి పరిపాలనా కేంద్రంతో పాటు 30 చోట్ల నైపుణ్య శిక్షణ కాలేజీలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్‌లోనే పనులు...
గత సర్కారు నైపుణ్య శిక్షణ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు నిధులిచ్చి కమీషన్లకే దాసోహమైంది కానీ యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. తిరుపతిలో 50 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ పరిపాలనా కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు 30 స్కిల్ కాలేజీలను ఐదు నుంచి పది ఎకరాల్లో నెలకొల్పేందుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. అక్టోబర్‌లో నిర్మాణ పనులను ప్రారంభించి 12 నుంచి 18 నెలల్లోగా పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఏటా 50,000 మందికి శిక్షణ..
► నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా ఏటా 50 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలకు అవసరమైన వారికి ఉద్యోగాలు కల్పించి మిగిలిన వారికి ఆయా రంగాల్లో నైపుణ్య సర్టిఫికెట్లను అందచేస్తారు. పరిపాలనా కేంద్రంతో పాటు 30 స్కిల్ కాలేజీల నిర్మాణానికి రూ.1,210.06 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి నిర్వహణకు ఏటా రూ.190.48 కోట్లు వ్యయం కానుంది. చదువుకున్న యువతకు ఉపాధి లభించేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఏ ప్రభుత్వమూ గతంలో ఇంత పెద్ద ఎత్తున వ్యయం చేసిన దాఖలాలు లేవు.
ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులు..
► స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా 20 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరం కాగా 120 కోర్సులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెసీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ లాంటి కంపెనీల భాగస్వామ్యంతో ఈ కోర్సులను గుర్తించారు. స్థానిక, భారీ, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను సమకూర్చడమే లక్ష్యంగా 30 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
► అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను అందించేందుకు జర్మనీకి చెందిన జీఐజీ (జర్మనీ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్), సింగపూర్ పాలిటెక్నిక్, యూకేకు చెందిన డీఎఫ్‌ఐడీ (డిపార్ట్‌మెంట్ ఆన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్), టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్సిటీ, ఐబీఎం, ఫేస్‌బుక్, టీసీఎస్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా నైపుణ్యాభివృద్ధి రంగంలో ప్రభుత్వం తీసుకోనుంది. ఈ సంస్ధల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు రూపొందించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి.
► ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్‌డ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తాయి. సీఎం ఆదేశాల మేరకు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థుల వివరాలు సేకరించేందుకు వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహిస్తారు.
అంతర్జాతీయ సంస్థల సహకారంతో..
ప్రస్తుతం యువతకు సంబంధించిన సర్వే కొనసాగుతోంది. ఇది రెండు నెలల్లో పూర్తవుతుంది. సర్వే వివరాల ఆధారంగా స్కిల్ కాలేజీల్లో కోర్సులు ప్రవేశపెడతాం. వీటి ఏర్పాటులో సింగపూర్, యూకే, యుఎస్‌ఏ, జర్మనీ సహకారం తీసుకుని అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో పనిచేస్తాం. కాలేజీల్లో నిరంతరం శిక్షణ కొనసాగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న స్కిల్ కాలేజీలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంటాయి
– అనంత రాములు, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఉపాధి కల్పనకు అనువుగా కోర్సులు
స్కిల్ కాలేజీల్లో కోర్సులన్నీ అభ్యర్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి జగన్ స్కిల్ కాలేజీల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ కాలేజీల్లో ప్రముఖ కంపెనీలు తమ యూనిట్లను ప్రారంభించి అభ్యర్థ్ధులకు శిక్షణ ఇస్తాయి. నెల, మూడు నెలలు, ఆరునెలలు కాలపరిమితి కలిగిన కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగులుగా నియమించుకుంటాయి. సర్టిఫికెట్లు ఆధారంగా అభ్యర్థులు ఇతర కంపెనీల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు.
– చల్లా మధుసూదనరెడ్డి , స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్
ఫినిషింగ్ స్కూల్ విధానం..
ఫినిషింగ్ స్కూల్ విధానాన్ని అమలులోకి తెస్తున్నాం. ఐబీఎం, స్కోడా, మారుతీ, జాగ్వార్ లాంటి ప్రముఖ సంస్థలు తమ సొంత యంత్ర పరికరాలతో స్కిల్ కాలేజీల్లో యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. శిక్షణ ఇచ్చి ఎంపికైన వారిని ప్రొబేషనరీ సమయం లేకుండా నేరుగా ఉద్యోగంలో చేర్చుకుంటాయి. స్కిల్ కాలేజీల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇన్ఫార్మల్ కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు క్లాస్ రూమ్‌లు కేటాయిస్తాం.
– అర్జా శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్