ఎస్కేయూ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ అమోదం తెలపడంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) విద్యార్థులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వర్సిటీ ఎదుట 205 జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం నగరంలోకి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు పంగల్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐలు రాజా, మహబూబ్‌బాషా, శ్రీనివాసులు, మాధవ్, ప్రవీణ్‌కుమార్ అధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోకి వెళ్లేందుకు అనుమతించేదిలేదని వెనక్కు వెళ్లిపోవాలని విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ససేమిరా అనడంతో బలవంతంగా వెనక్కు నెట్టే ప్రయత్రం చేశారు. తామేమైనా రౌడీల్లా కనిపిస్తున్నామా అంటూ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర సాధన కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న తమపై బలప్రయోగం ఎందుకని నిలదీశారు.
‘పోలీస్ జులుం నశించాలి’.. ‘సోనియా డౌన్‌డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో విద్యార్థులు ప్రతిఘటించడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ముగ్గురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఇద్దరు విద్యార్థులు అక్కడే తేరుకోగా.. మరో విద్యార్థి శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంలో వైద్యం నిమిత్తం పోలీసుల వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా మూడు గంటల పాటు హైడ్రామా నడిచింది. చివరకు ఆందోళనకారులను అరెస్టు చేసి ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ... ఇటలీ నుంచి వచ్చిన సోనియా రాష్ట్ర విభజనకు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మాఫియాలా వ్యవహరిస్తూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు మూటలకు అమ్ముడుపోయి ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు.
అడుగడుగునా పోలీసుల అడ్డగింత
సమైక్యమే తమ నినాదమంటూ ఉద్యమాన్ని బలపర్చేందుకు నగరంలోకి వస్తున్న ఎస్కేయూ విద్యార్థులకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. ఎస్కేయూ విద్యార్థులు నగరంలోకి వెళ్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందనే కారణంతో స్పెషల్ పార్టీ, ఏపీఎస్‌పీ పోలీసులు రోప్ ద్వారా నిలువరించారు. అయినా పలువురు విద్యార్థులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని పరుగు తీస్తుండడంతో వారిని విచక్షణా ర హితంగా ఈడ్చి పారేశారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి నగరంలోకి, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో డాక్టర్ సదాశివరెడ్డి, నాయకులు లింగారెడ్డి, బాలాస్వామి, నరసింహారెడ్డి, పులిరాజు, పరుశురాంనాయక్, వెంకటేష్, వెంకట్, పురుషోత్తంరెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మీకర్‌బాబు, తిమ్మప్ప తదితరులు ఉన్నారు.
భయపెట్టి.. అణగదొక్కి..
Published Sat, Dec 7 2013 6:15 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement