ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత జూలై 16 నుంచి ఆగస్టు 27 వరకు ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. మూడు దఫాలుగా వర్షాలు కురియడంతో చెన్నూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, దహెగాం, బెజ్జూర్, బేల, జైనథ్ మండలాల్లో అపా ర నష్టం సంభవించింది. ప్రభుత్వం తూతూ మంత్రంగా సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం నష్టపోయిన రైతులను పరిగణలోకి తీసుకోవడంతో చాలామంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారు.
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 5.76 లక్షల హెక్టార్లలో సాగవగా ఇందులో పత్తి 3.10 లక్షలు అత్యధికంగా, సోయా 1.19 లక్షలు, వరి 52 వేలు, కందులు 37 వేలు, జొన్న 16 వేల హెక్టార్లలో సాగయ్యాయి. భారీ వర్షాల కారణంగా 1.18 లక్షల మంది రైతులు 67,490 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రూ.61.25 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బాధిత రైతులకు పరిహారంగా నిర్ధారించారు. 61,752 హెక్టార్లలో 1,11,014 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయిన వారిలో ఉన్నారు. ఇందులో రూ.55.96 కోట్లు చిన్న, సన్నకారు రైతులకే రావాల్సి ఉంది.
మహారాష్ట్రలో పరిహారం.. మనకు మొండిచేయి..
ఇదే జూలై నుంచి ఆగస్టు వరకు మహారాష్ట్రలో కూడా వర్షా లు కురిశాయి. అపార నష్టం సంభవించింది. అక్కడి రైతుల కు సకాలంలో పరిహారం అందింది. మన జిల్లా రైతులకు మాత్రం మొండిచేయి ఎదురవుతోంది. మూడు నెలల క్రితం మహారాష్ట్రలోని పెన్‌గంగా సరిహద్దు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరత్‌పవార్ వచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు శరత్‌పవార్‌ను కలిసి నష్టపరి హారం గురించి విన్నవించారు.
పంట నష్టపరిహారానికి సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందలేదని, మహారాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించడంతో తాను మహారాష్ట్రలోని పంటలను పరిశీలించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తీరును తేటతెల్లం చేసింది. అధికారులు సర్వే చేసి పంపించినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సకాలంలో పం పించడంలో విఫలమైంది. దీంతో ఆరు నెలలైనా పరిహారం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిండా మునిగిన రైతులు
ప్రకృతి వైపరీత్యాలకు పంటలు కోల్పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందించడంలో అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదు. రైతులకు బాసటగా నిలవాల్సిన రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ పంటనష్టం అంచనాలో వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. కొన్ని గ్రామాలను అసలే సందర్శించక పోవడంతో పలువురు రైతుల పేర్లు జాబితా కెక్కలేదు. ఆయా గ్రామాల్లో సర్వే చేసినా అనేక మంది పేర్లు నమోదు చేసుకోకుండానే ముగించారు. 50 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన రైతులకే పరిహారం ఇవ్వాలనే నిబంధనతో నష్టాన్ని లెక్కించారు.
దీంతో అనేక మంది రైతులు నష్టపోయారు. కలుపు, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగడంతో పెట్టుబడి పెరిగింది. ఈ లెక్కన సుమారుగా రూ. 300 కోట్లకు పైగా నష్టం జరిగితే ప్రభుత్వం నామమాత్రంగా రూ.61 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నిర్ధారించారనే విమర్శలు ఉన్నాయి. వెంటనే పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పరిహారం.. పరిహాసం..
Published Mon, Jan 6 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement