
వీరి తెలివి బంగారం గానూ..
- రకరకాల మార్గాల్లో బంగారం తరలింపు
- స్మగ్లర్ల తీరుపై అధికారుల విస్మయం
- ఎయిర్‌పోర్టులో భద్రతపై సందేహాలు
- అత్యాధునిక స్కానర్లు, డాగ్‌స్క్వాడ్ ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, విశాఖపట్నం: బంగారం స్మగ్లింగ్‌లో నిందితులు అనుసరిస్తున్న విధానాలు రోజుకో తరహాలో సాగుతున్నాయి. అధికారులు పసిగట్టలేనంతగా వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుతున్నారు. సోమవారం రాత్రి సింగపూర్, మలేషియా నుంచి 63.84 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 56 మందిని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డిఆర్‌ఐ) వలపన్ని పట్టుకున్న విషయం విదితమే. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ సోదాలు నిర్వహించిన ప్రత్యేక బృందాలు మంగళవారం తెల్లవారుజామున నిందితులందిరినీ చెన్నై తీసుకువెళ్లారు.
సినిమాల్లో స్మగ్లింగ్ సీన్‌లు చూసినప్పుడు భలే తప్పించుకున్నాడే..భలే పట్టుకున్నారే..అని ఆశ్చర్యపోతుంటాం. ఇక్కడి విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టుచేసినప్పుడు అధికారులకు ఇదేతరహా విస్మయం కలిగింది. సాధారణంగా కస్టమ్ డ్యూటీని చెల్లించకుండా తప్పించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే వారు బంగారం బిస్కెట్లను రకరకాల మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తుంటారు. దీనికోసం ఒక్కోసారి ప్రాణాలకు తెగిస్తుంటారు. ఇటీవల పలు సంఘటనల్లో శరీరం లోపల, లో దుస్తుల్లో బంగారం ఉంచి తీసుకురావడం బయటపడింది. తాజా సంఘటనలో నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణ సామాగ్రిలో ఉంచి తీసుకువచ్చారు. వాటి లోపల మామూలుగా ఉంచితే దొరికిపోయే అవకాశం ఉన్నందున బిస్కెట్లను ముక్కలుగా చేశారు.
వాటిని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉంటే ట్రాన్స్‌ఫార్మర్లులో, యాంఫ్లిప్లేయర్స్‌లో ఉండే అయస్కాంతాల్లో, మ్యూజిక్ సిస్టమ్‌కు వాడే స్టాండ్లలో, వాషింగ్ మెషిన్‌లోని సెంట్రల్ పుల్లైలో, ఇలా అనేక చోట్ల చొప్పించారు. వీటిని సాధారణ బ్యాగేజ్ స్కానర్లు గుర్తించడం చాలా కష్టమని డిఆర్‌ఐ అధికారులు నోరెళ్లబెట్టారు. దీంతో ప్రతి వస్తువును పగలగొట్టి,అన్ని భాగాలను పూర్తిగా తనిఖీ చేశారు. అందువల్లనే వారికి అంత సమయం పట్టింది.
భద్రతా ప్రమాణాలపై దృష్టి: తాజా ఉదంతం విమానాశ్రయ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. అంతమంది మూడు విమానాల్లో అంత భారీ స్థాయిలో బంగారాన్ని తీసుకురావడానికి సాహసించారంటే భద్రత బలహీనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై డిఆర్‌ఐ ఆధికారులు దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ చేయడానికి కూడా చెన్నై, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. అలా రాకుండా ఉంటే, అసలు రోజూ ఇంకెంత బంగారం ఇలా స్మగ్లింగ్ అవుతెందో అనే ప్రశ్నలు వారిని తొలిచేస్తున్నాయి.
కేవలం బ్యాగులో ఏముందో చూపించే స్కానర్లు కాకుండా, లోతుగా చూపించే అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. సిబ్బందిని పెంచడంతో పాటు డాగ్ స్క్వాడ్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనతో విమానాశ్రయ వర్గాలు కూడా భద్రతపై దృష్టి సారించాయి.