గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం రేపింది. ఇన్ పేషెంట్ విభాగం 222 నంబరు గదిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో మంగళవారం అర్ధరాత్రి పాము ప్రత్యక్షం కావడంతో రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది పెద్దగా కేకలు పెడుతూ ఐసీయూ నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీయూలో వెనుకవైపు రెండు వెంటిలేటర్లతో కూడిన పడకలను ఏర్పాటుచేశారు. ఐసీయూ నుంచి పాము బయటకు రావడాన్ని ఇక్కడ చికిత్స పొందుతున్న మూడేళ్ల బాలిక శ్రావ్య, కుటుంబ సభ్యులు గమనించారు. పాము కనబడడంతో పెద్దగా కేకలు వేసి విధుల్లో ఉన్న నర్సింగ్ సిబ్బందిని పిలిచారు. రోగుల సహాయకులంతా అరవడం ప్రారంభించారు. వారి అరుపులకు పాము బయటకు వెళ్లిపోయింది. బుధవారం విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి ప్రాంతమంతా పరిశీలించారు. మళ్లీ పాములు ఇతర క్రిమికీటకాలు లోపలికి ప్రవేశించకుండా మెష్‌లు ఏర్పాటుచేశారు.
ఇది రెండోసారి..
ఐసీయూలో 4 నెలల క్రితం ఇదే తరహాలో పాము రావడంతో రోగులు భయాందోళన చెందారు. నాడు పాములు రాకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. అయినా, పాము మళ్లీ రావడం చర్చనీయాంశంగా మారింది. పాములు, ఎలుకలు, ఇతర క్రిమికీటకాల నివారణ కోసం ప్రభుత్వం పద్మావతి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ అండ్ ఫెసిలిటిస్ మేనేజ్‌మెంట్ సంస్థకు రెండేళ్ల క్రితం కాంట్రాక్టు అప్పగించింది. ప్రభుత్వం ప్రతినెలా రూ.3లక్షలకు పైగా కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. అయినా, పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడంలేదనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు మార్కుల శాతాన్ని తగ్గిస్తున్నప్పటికీ వారు పనితీరు మెరుగుపరుచుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment