ప....ప....పాము | Snakebite deaths | Sakshi
Sakshi News home page

ప....ప....పాము

Published Sun, Jul 12 2015 1:29 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

Snakebite deaths

భామినికి చెందిన వివాహిత బాడితమాను కల్పన గత ఏడాది ఆగస్టు 23వ తేదీన పాముకాటుతో మృతి చెందింది.   భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన దాసరి యుగంధర్ అనే పదో తరగతి విద్యార్థి గత ఏడాది ఆగస్టు  18వ తేదీన విషనాగు కాటుకు బలయ్యాడు.  వీరిద్దరికీ సకాలంలో వైద్యసేవలంది ఉంటే బతికి ఉండేవారేమో...  ఇలా వీరే కాదు. ఎంతోమంది పాముకాటుకు బలై కేవలం మూఢనమ్మకాల వల్లనో... సకాలంలో వైద్యం అందకనో  మృత్యువాత పడుతున్నారు. రాబోయేది వర్షాకాలం. పాముకాటు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షి కథనం. - భామిని
 
 వరద కాలువలు... లోతట్టు పొలాల్లో సర్పాలు పెరుగుతూ అవి కాస్తా బయటకు వచ్చి ఎదురుపడినవారిని కాటేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విషనాగుల సంచారం ఎక్కువైంది. వీటి బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అదృష్టవశాత్తూ సకాలంలో వైద్యం పొంది బతికి బట్టకడుతున్నారు. ఇంకా గ్రామాల్లో మంత్రాలు... పసరమందులు పేరుతో నాటువైద్యంపై గుడ్డినమ్మకంతో కాలయాపన చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అవగాహన కలిగినవారు మాత్రం వెంటనే ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రిలో వైద్యం పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు.
 
 పెరుగుతున్న పాముకాటు మృతులు...
 ఇంకా వర్షాకాలం మొదలు కాకుండానే పాముకాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. గత ఏడాది ప్రధానంగా భామిని మండలంలోనే అత్యధికంగా పాముకాటువల్ల మృత్యువాత పడ్డారు.
 
 భామిని మండలం ఇసుకగూడకు చెందిన నాలుగేళ్ళ ఆదివాసీ బాలుడు కొండగొర్రి నవీన్ ఈతపళ్ళు ఏరుతుండగా విషనాగు కాటుకు గురై నాటు వైద్యం పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు.
 
 బాలేరుకు చెందిన 11ఏళ్ళ విద్యార్థి పైల ప్రకాశ్ ఇంటిపెరటిలో బంతితో ఆడుతుండగా విషనాగు కాటుకు గురైనాడు.  
 2012 ఆగస్టు 15న భామిని మండలం చిన్నదిమిలికి చెందిన నాగళ్ల రామస్వామి(50) పెద్దదిమిలిలో పశువులను మేపిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు.
 
 జూలై  24న ఘనసరకు చెందిన కూరాకుల రైతు బొల్లు మిన్నారావు(45) పొలంలో పాముకాటుకు గురై రిమ్స్‌లో మృతిచెందాడు.
 
 బొమ్మిక కు చెందిన గిరిజనుడు పసుపురెడ్డి జగన్నాయుకులు(50)నిద్రలోనే పాముకాటు గురై చనిపోయాడు.
 లాహొరజోలకి చెందిన డప్పువాయిద్య కళాకారుడు, రేడియో ఆర్టిస్టు నిమ్మల చిన్నారావు(30) పాముకాటుకు బలయ్యాడు.
 బిల్లుమడకు చెందిన గృహిణి కొనపరెడ్డి శశిమ్మ(50) ఇంటి పెరటిలో పిడకలు తీస్తూ పాముకాటుకు గురై కొత్తూరు ఆసుపత్రిలో మృతి చెందింది.
 2011 సెప్టెంబర్ 25న సొలికిరికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కొత్తకోట గజపతి రావు పాము కాటుకు గురై మృత్యువాత పడ్డారు.
 ఇవన్నీ అధికారికంగా గుర్తించినవి. ఇవిగాకుండా మనకు తెలియని మరణాలెన్నో ఉన్నాయి.
 
 పాము కాటు గుర్తించడం ఎలా...
 
 విష సర్పం కాటు వేస్తే శరీరంపై ఇంజిక్షన్ సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు రెండు చోట్ల మాత్రమే కోరల కాట్లు, రక్తం చుక్కలు కనిపిస్తాయి. సాధారణ పాము కరిస్తే కాట్లు సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
 
 భయంతోనే ప్రాణ నష్టం....
 పాము కాటేసిన వెంటనే కేవలం భయంవల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కాకుండా పాము కాటేసిందని గుర్తించిన వెంటనే దాని విషం శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకట్టవేసేలా కట్టుకట్టాలి. కాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి.
 
 విష సర్పాలు రకాలు...
 మన చుట్టూ తిరుగుతున్న పాముల్లో అత్యధికంగా విషంలేని సర్పాలే ఉన్నాయి. ప్రమాదకరమైనవి కొద్దిగానే ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా త్రాచుపాము, రక్తపింజర, కట్లపాములే ఉంటాయి. వాడుక భాషలో నాగుపాము, పొడపాములు అతి ప్రమాదకరమైనవి.
 
 అందుబాటులో యాంటీస్నేక్ వీనమ్
 పాముల విషాన్ని నివారించే యాంటీస్నేక్ వీనమ్(ఏఎస్‌వి) మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పీహెచ్‌సీలలో ఈ ఇంజిక్షన్లు సిద్ధంగా ఉంచారు. పాము కాటేసిన వెంటనే ఏమాత్రం ఆందోళన చెందకుండా వెంటనే ఆస్పత్రికి తరలించాలి. పాముకాటు పడిన తరువాత ఏర్పడిన గాయాన్ని కడగవద్దు. గాయాన్ని గుర్తించి పాము ప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. బాధితుడిని అనవసరంగా ఒత్తిడికలిగించకుండాప్రశాంతంగా ఆస్పత్రులకు తరలించాలి. సకాలంలో వారు రాగలిగితే వెంటనే మందు ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు అవకాశం ఉంటుంది.
 - డాక్టర్ కే.విజయ పార్వతి, వైద్యాదికారిణి బాలేరు,బత్తిలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement