మరీ ఇంత శత్రుత్వమా!
- ఆరోగ్యమిత్రలకు అడుగడుగునా అన్యాయమే
- అరకొర వేతనాలు
- కానరాని ఈఎస్‌ఐ కార్డులు
- పీఎఫ్ అనుమానమే
- పట్టించుకోని అధికారులు
విశాఖపట్నం,న్యూస్‌లైన్ : తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం నిరీక్షించే పేదలకు వారు నిజంగా ఆరోగ్య మిత్రలే.. ఆపద్బంధువులే. అయితే వారు మాత్రం తమ జీవితాలకు సంబంధించి ఎంతో శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమన్వయకర్తలుగా పని చేస్తున్న ఆరోగ్యమిత్రలు ఉద్యోగాలకు, వేతనాలకు సంబంధించి అనేక సమస్యల నడుమ పని చేస్తున్నారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని డిస్పెన్సరీలు, జిల్లాలోని ఆరోగ్యకేంద్రాల్లో 105 మందిఆరోగ్యమిత్రలు 2007 నుంచి పనిచేస్తున్నారు. రోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే తమ బాగోగుల గురించి ఆలోచించేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతమంది సమన్వయకర్తలు, కలెక్టర్లకు మొర పెట్టుకున్నా తమ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ఔట్‌సోర్సింగ్ సంస్థ శ్రమ దోపిడీ చేస్తున్నా ఇటు జిల్లాయంత్రాంగం గాని, అటు కార్మిక శాఖగాని పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వీరి వేతనం రూ.3,900 కాగా, తరువాత రూ.2,500కి తగ్గించేశారు. 2012 నుంచి కటింగ్‌లు పోనూ రూ.4,600 వంతున చెల్లిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఈ వేతనాలతో ఎలా బతకాలో అర్ధం కావడం లేదని వీరు గగ్గోలు పెడుతున్నారు.
విధులివీ
ఆరోగ్యమిత్రలు డిస్పెన్సరీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు నిర్వహిస్తారు.
ఆరోగ్యశ్రీ సేవల కోసం రోగులకు ఆస్పత్రులను సిఫార్సు చేస్తారు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేస్తారు.
ఒక్కో ఆరోగ్యమిత్ర రెండు నుంచి మూడు వార్డులలో సేవలందిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ చికిత్సల తరువాత ఏడాది కాలం వరకు రోగుల బాగోలను వీరే చూసుకోవాల్సి వుంటుంది.
సమస్యలివీ
పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తాలు మినహాయిస్తున్నా సంబంధిత సంస్థలకు ఈ మొత్తాలుమ చేస్తున్నారో లేదోనన్న సందేహం
ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కనీసం ఈఎస్‌ఐ కార్డులు కూడా అందించని యాజమాన్యం
అందరికీ ఆరోగ్య సేవల కోసం పనిచేస్తున్న వీరి ఆరోగ్యానికి కనీస రక్షణ శూన్యం
ఆందోళనలే మిగులు
ప్రస్తుతం వీరంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (హైదరాబాద్) సంస్థ కింద ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కలెక్టర్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలు మారినప్పుడల్లా తమ బాధలు వెళ్లబోసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. 2011లో తమకు టీఏ బిల్లుకింద నెలకు రూ.వెయ్యి ఇస్తామన్నారని, అది కార్యరూపం దాల్చలేదని అంటున్నారు.