ఇది పార్టీ సభ కాదు..సమైక్య సభ | sobha nagireddy calls all parties to support samaikya sabha | Sakshi
Sakshi News home page

ఇది పార్టీ సభ కాదు..సమైక్య సభ

Published Sun, Oct 20 2013 2:11 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ఇది పార్టీ సభ కాదు..సమైక్య సభ - Sakshi

ఇది పార్టీ సభ కాదు..సమైక్య సభ

తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని నేతలకు వినిపించేలా, విభజనకు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. ఇదొక పార్టీ సమావేశం కాదని, సమైక్యంగా ఉండాలని కోరుతూ నిర్వహించే సభ కనుక అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో పార్టీ నేతలతో కలిసి సభా ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

26వ తేదీ జరుపబోయే ఈ సభలో రాజకీయాలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోరుకునే వారందరూ పాల్గొనాలనేది పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమని, అందువల్ల ఉద్యోగులు సహా అన్ని వర్గాలవారూ పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభకు ఎంత మంది హాజరవుతారనేది అంచనాలు వేయడం లేదని, కానీ అనూహ్యమైన రీతిలో జన స్పందన ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల నుంచీ కూడా సమైక్యం కోరుకునే వారు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు.
 
 

భారీగా ఏర్పాట్లు: భారీగా తరలివచ్చే వారందరికీ పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే వారు ఎక్కడికి రావాలి, వాహనాల పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి వంటి విషయాలకు సంబంధించిన సమాచారం జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, అక్కడ సంప్రదించాలని కోరారు. అలాగే సమావేశ స్థలికి వచ్చేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాగులు వంటివి తీసుకురావద్దని ఆమె సూచించారు. మొన్నటి వరకూ సుమారు 70 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారని, జీతాలు రాకున్నా చిత్తశుద్ధితో వారు సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని ఆమె అభినందిస్తూ సభ విజయవంతం కావడానికి ఎన్జీవో సోదరుల సహకారం తీసుకుంటామన్నారు. ఒక రాజకీయ పార్టీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశానికి మద్దతునివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
 
 సభ నిర్వహణపై చర్చలు..
 హైదరాబాద్ నగర సంయుక్త కమిషనర్(ఎస్‌బీ) మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డిలు శనివారం ఎల్బీ స్టేడియంకు చేరుకొని సభ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. అనంతరం సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రాథమికంగా స్టేడియం పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, తెల్లం బాలరాజు,  విశ్వరూప్, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, ద్వారంపూడి, కొడాలి నాని, ఇతర నేతలు బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, తలశిల రఘురాం, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఆదం విజయకుమార్, అవినాష్‌గౌడ్ తదితరులు ఎల్బీ స్టేడియంను సందర్శించిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement