రూ. 33.72 లక్షలు స్వాహా
=అక్రమార్కుల్లో సీఎస్‌పీలు, పంచాయతీ కార్యదర్శులు
=సామాజిక తనిఖీల్లో అక్రమాలు బహిర్గతం
=రికవరీ బాధ్యత బ్యాంకులదే
వృద్ధులు...
వికలాంగులు... వితంతువులకు ప్రభుత్వం అంద జేసే సామాజిక భద్రతా పింఛన్ సొమ్మును కూడా అక్రమార్కులు వదల లేదు. పింఛన్ వచ్చినా రాలేదని చెప్పి, ఊళ్లో ఉన్నా.. లేనట్టు తప్పుడు నివేదికలు ఇచ్చి, చనిపోయినవారు బతికున్నట్లు లెక్కలు రాసి... పింఛన్ డబ్బులు అందిన కాడికి దోచుకుతిన్నారు. సీఎస్‌పీ(కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)లు అక్రమాలకు ప్పాడుతున్నారని వారిని తప్పించి పంచాయతీ క్యాదర్శులకు పింఛన్లు పంచే బాధ్యతను అప్పగిస్తే.. వారు కూడా అక్రమాలకు తెగబడ్డారు. మొత్తంగా జిల్లాలో సుమారు 3.50 లక్షల మందికి అందించాల్సిన పింఛన్ సొమ్ము నుంచి రూ. 33,72,323 దిగమింగారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ద్వారా అందజేసే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ గతంలో సీఎస్‌పీల ద్వారా జరిగేది. ప్రభుత్వం పింఛన్ సొమ్మును బ్యాంకులో వేస్తే బ్యాంకరు.. ఆ డబ్బును సంబందిత సర్వీసు ప్రొవైడర్ ఖాతాకు జమచేస్తే.. సర్వీసు ప్రొవైడర్ గ్రామాల వారీగా ఏర్పాటు చేసుకున్న సీఎస్‌పీలు పింఛన్ సొమ్మును పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో సీఎస్‌పీల వ్యవస్థ వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, సర్వీసు ప్రొవైడర్‌లు బాధ్యతగా వ్యవహ రించడం లేదని ఆరోపణలు రావడంతో పంపిణీ బాధ్యతలు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. అయితే చాలా చోట్ల కార్యదర్శులు కూడా చేతివాటం ప్రదర్శించారు. దీంతో ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా పంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అన్ని మండలాల్లోనూ అక్రమాలు
పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరగడంతో అధికారులు సోషల్ ఆడిట్ ద్వారా నిజాలు నిగ్గు తేల్చాలని భావించారు. దీంతో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్)లో మాదిరిగా గ్రామ సభలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పనిచేసిన సీఎస్‌పీల్లో చాలా మంది ప్రస్తుతం విధుల్లో లేరు. జీరోమాస్, ఫినో వంటి ప్రైవేట్ సంస్థలతో ప్రస్తుతం పంపిణీ ఒప్పందం లేనందున సీఎస్‌పీలు కూడా పనిచేయడం లేదు. అయితే మింగిన సొమ్మును ఎలా కక్కించాలా అన్నది అధికారులకు సవాల్‌గా మారింది.
డీఆర్‌డీఏ, ఐకేపీ నుంచి ఈ పనులు చేపట్టడం కుదరదని భావించిన అధికారులు అక్రమాలకు పాల్పడిన సీఎస్‌పీలు ఏ సంస్థ పరిధిలో పనిచేశారో ఆ సంస్థ నుంచి బ్యాంకర్లు ఈ డబ్బును రాబట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. అయితే బ్యాంకర్లు ఏమేరకు శ్రద్దవహిస్తారు... ఎంతమేరకు రికవరీ అవుతాయన్నది వేచి చూడాలి.
కక్కించింది రూ.3,90,120
రూ.33.72లక్షలు మెక్కిన అక్రమార్కుల నుంచి సోషల్ ఆడిట్ సందర్బంగా నయానా...భయానా మొతం రూ.3.90లక్షలు మాత్రం కక్కించగలిగారు. జిల్లా మొత్తంలో అక్రమాలు జరినట్లు గుర్తించినా కేవలం గీసుకొండ, నెక్కొండ, హసన్‌పర్తి, పాలకుర్తి, రేగొండ, చెన్నారావుపేట, హన్మకొండ మండలాల్లోంచి రూ.3.90లక్షలు రికవరీ చేయగలిగారు. మిగతా సొమ్ము రాబట్టే విషయంలో ఏంచేయాలనే విషయంపై అధికారులు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
పింఛన్ దోచెన్
Published Thu, Oct 24 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement