బాబు ఫేస్‘బుక్క య్యారు’
సోషల్ మీడియా ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ మీడియాగా బాగా ఎదిగిపోతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్లను తమ అభిప్రాయాలు వెల్లడించడానికి అన్ని వర్గాల వాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ అయితే, రాజకీయ నాయకుల మీద రక రకాల కామెంట్లకు అతిపెద్ద వేదికగా మారిపోయింది. ఈ కోవలో ఇప్పుడు ఫేస్ బుక్ చేతిలో బుక్కయిపోయిన నాయకుల జాబితాలో చంద్రబాబు నాయుడు, చిరంజీవి చేరారు.
తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరంలేదంటూ లేఖ ఇచ్చి.. తీరా రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన చాలా రోజులకు తీరుబడిగా స్పందించి.. సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మగౌరవ యాత్ర అంటూ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యవాదుల చేతిలో ఫేస్‘బుక్కయ్యారు’. తమ నిరసన, ఆవేదన, ఆక్రోశాన్ని, అభిప్రాయాలను వెల్లడించేందుకు సమైక్య వాదులు సామాజిక నెట్‌వర్క్‌లను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకులైన వారిని తూర్పారబడుతున్న సమైక్యవాదులు తాజాగా చంద్రబాబుపైన పొలిటికల్ సెటైర్లు సంధిస్తున్నారు.
విద్యావంతులు, మేథావులు ఫేస్‌బుక్‌లో బాబుపై కామెంట్లు పోస్టు చేయడం, వ్యంగ్య చిత్రలను అప్‌లోడ్ చేయడం కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ వాటిని చూసి లైక్, కామెంట్, షేర్ చేయడంతో నవ్వుల పువ్వులు పూయించడంతోపాటు చంద్రబాబు వైఖరిని అందరికి చాటిచెబుతున్నారు. కొద్ది రోజులుగా రోజువారీ అప్‌డేట్స్‌తో పొలిటికల్ సెటైర్ పేరుతో చంద్రబాబుపై పెడుతున్న సెటైర్లు ఆలోచింపజేస్తున్నాయి.
‘సీమాంధ్రలో నిర్మించే రాజధాని బాధ్యతలు బాబూకే అప్పగించాలి. చంద్రబాబు చెప్పిన చోటే రాజధాని నిర్మించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే.. సీమాంధ్రలో రాజధానిని నిర్మించాలంటే కనీసం ఐదారు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పడం.. వాటిని పరిశీలించిన పాఠకుడు మాత్రం ఏమప్పా సిద్ధప్పా.. అబ్బా ఏమి చెబితిరి.. ఏం చెబితిరి.. రాజధానిని కట్టించే వ్యాపారం చేస్తే ఆ కిక్కే.. వేరప్పా’ అంటూ ముక్తాయింపు ఇచ్చినట్టు పెట్టిన సెటైర్ హల్‌చల్ చేస్తోంది.
‘నా పాలన చూసే శంకర్ ఒకే ఒక్కడు సినిమా తీశాడని చంద్రబాబు అంటే.. అవునులే నీలో కాంగ్రెస్ జీన్స్ చూసి జీన్స్ సినిమా తీశాడేమో’ అని సామాన్యుడు వ్యాఖ్యానిస్తున్నట్లు ఉన్న మరో సెటైర్ ఆకట్టుకుంటోంది. ‘తెలంగాణ, సమైక్యవాదం రెండు సిద్ధాంతాలకు తోడు ఇప్పుడు రాయల్ తెలంగాణ తెరపైకి రావడంతో మూడు కళ్ల సిద్ధాంతం వస్తుందంటూ’ బాబుపై వేసిన ఫేస్‌బుక్ సెటైర్ అందర్ని ఆలోచింపజేస్తోంది.
తెలంగాణ విభజనపై బాబు ఆలస్యంగా నోరువిప్పిడం, తెలంగాణ, సమైక్యాంధ్ర రెండు పడవలపై చంద్రబాబు కాలేయడం, ఏం ఏం చేయాలో తెలియక ఆత్మగౌరవ యాత్రను చేపట్టడం, తెలంగాణకు అను కూలంగా బాబు ఇచ్చిన లేఖ, సానుభూతితో పార్టీలకు ఓటేయొద్దని బాబు ప్రకట నలు ఇవ్వడం తదితర అంశాలపై ఫేస్‌బుక్‌లో పెట్టిన పొలిటికల్ సెటైర్లు అక్షరాల తూటాలై పేలుతున్నాయి.
ఇక చిరంజీవి విషయానికొస్తే, పైన చింపాంజీ బొమ్మ పెట్టి, కింద చిరంజీవి బొమ్మ పెట్టి, చింపాంజీ అడవిని వదలదు, చిరంజీవి పదవిని వదలడు. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగులను మార్చి సెటైర్లు పేలుస్తున్నారు.