సాంఘిక సంక్షేమ శాఖలో వర్గపోరు వీధికెక్కింది. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విభాగంలో భారీగా అక్రమార్జన ఉండటంతో ఆ కుర్చీ కోసం కార్యాలయ సిబ్బంది వర్గాలుగా విడిపోయారు. సీటు మాకంటే..మాకంటూ గొడవలకు దిగారు. ఏకంగా ఒకరిపై ఒకరు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు వర్గాల వారు పనులు పక్కన పెట్టి కొన్ని కులసంఘాల మద్దతుతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ సాంఘిక సంక్షేమ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
సాక్షి, నెల్లూరు: సాంఘిక సంక్షేమ శాఖలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విభాగాలకు చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని మూడో తరగతి నుంచి ఇంటర్, ఇంజనీరింగ్, మెడికల్‌తో పాటు పలు విభాగాలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ లావాదేవీలు ఈ విభాగాల ద్వారానే జరుగుతాయి.
ప్రధానంగా ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంటేపైనే ఆధారపడి నడుస్తున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజులు కోట్లరూపాయల్లో ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లు, కళాశాలల అకౌంట్లకు జమవుతాయి. అందులో భాగంగా విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారానే వెళతాయి. ఈ క్రమంలో ఫీజురీయింబర్స్‌మెంట్ క్లియరెన్స్ కోసం ప్రధానంగా ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలల వారు సాంఘిక సంక్షేమ శాఖలోని కొందరు అధికారులకు భారీగా ముడుపులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కుర్చీకి డిమాండ్ : భారీ ఎత్తున ముడుపులు వస్తున్న క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విభాగానికి డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ముగ్గురు సిబ్బంది కొన్నేళ్లుగా తిష్టవేశారు. గత జూన్‌లో వారిని వేరే విభాగానికి బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. అప్పటి నుంచి ఆశాఖలో వర్గవిభేదాలు మొదలయ్యాయి. సీట్లు మార్చడంతో అక్రమార్జన తగ్గిపోయిందనే అక్కసుతో కొందరు సిబ్బంది, వారి మద్దతుదారులు కొత్తగా నియమితులైన వారిని తప్పించేందుకు వ్యూహరచన చేశారు. వారు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పించారు.
ప్రత్యర్థి వర్గం కూడా రంగంలోకి దిగి కార్యాలయంలోని అక్రమాలు, అవినీతికి వారే కారణమంటూ ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఇరువర్గాలు ఢీ అంటే ఢీ అంటూ వీధి పోరాటానికి దిగే స్థాయికి చేరాయి. వ్యక్తిగత విమర్శలు,అసాంఘిక కార్యకలాపాలపై సైతం విమర్శలకు దిగారు. వీరికి రెండు కులసంఘాలు మద్దతు పలికి ఆ శాఖలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయిన నేపథ్యంలో ఫీజురీయింబర్స్‌మెంట్ విభాగంలో పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ఇంతజరుగుతున్నా ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మాత్రం జోక్యం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సాంఘిక సంక్షేమశాఖలో వర్గపోరుకు తెరదించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కుర్చీలాట
Published Thu, Dec 5 2013 3:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement