కబంద హస్తాల్లో స్టేషన్లు..?
Published Sat, Nov 30 2013 3:50 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నాలుగా ఉండవలసిన పోలీసులే ఇప్పుడు అవస్థల పాలవుతున్నారు. విజయనగరంలో ఉండేందుకే భీతిల్లుతున్నారు. బదిలీ చేయించుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోయేందుకు యత్నిస్తున్నారు. బయటవారు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. రాజకీయ ఒత్తిళ్లు మితిమీరడమే దీనికి కారణమని చెబుతున్నారు. పలు స్టేషన్లు రాజకీయ నేతల కబంద‘హస్తా’ల్లో చిక్కుకున్నాయి. వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. ఈ విషయాన్ని కొందరు పోలీస్ అధికారులే అంగీకరిస్తున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందని వాపోతున్నారు. ఒక వైపు శాంతి భద్రతల సమస్యలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలా ..? లేక షాడోనేత చెప్పిందే చేయాలా, ఆయన అనుచరులు ఆడమన్నట్టు ఆడాలా అంటూ..? తలలు పట్టుకుంటున్నారు.
పోలీసులను అడ్డంపెట్టుకుని కొందరు అధికార పార్టీ నేతలు తమ ప్రత్యర్థులను నయానో.. భయానో
లొంగదీసుకుంటున్నారు. షాడోనేత జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసు స్టేషన్లపై అధిపత్యం చెలాయిస్తుండగా, చోటానేతలు ఆయా సర్కిళ్ల పరిధిలోని పోలీసు స్టేషన్లపై అజమాయిషీ చేస్తున్నారని కొందరు కొందరు స్టేషన అధికారులు, కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విజయనగరం ఒకటో పట్టణ, రెండో పట్టణ, రూరల్ పోలీసు స్టేషన్లతో పాటు జిల్లాలోని మరికొన్ని స్టేషన్లలో రాజకీయ నాయకుల జోక్యం మితిమీరుతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా, అధికార పార్టీ నాయకుల అనుచరులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి విచారణ లేకుండా వెనువెంటనే కేసులు కట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
పట్టణంలోని ఇప్పిలివీధిలో పల్లారాజు, ఆయన సోదరి గౌరిపై అదే ప్రాంతానికి చెందిన మురళీతోపాటు రాజారావు, శ్రీనువాసరావులు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితులు కేంద్రాస్పత్రిలో నాలుగురోజుల పాటు వైద్యసేవలు పొందారు. వారు కేసుపెట్టినా నమోదు చేయడంలో పోలీసుల తీవ్ర జాప్యం చేశారు. పత్రికల్లో వార్తలు రావడంతో కేసు నమోదు చేశారు. అయితే నిందితులను అరెస్ట్ చేయడంలో కూడా జాప్యం జరిగింది. దీని వెనుక అధికార పార్టీ నేతల ఒతిళ్లు పనిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రెండు నెలల క్రితం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దుప్పాడ పంచాయతీ చిల్లపేటలో ఓ ఇంటిపై దాడికి దిగి కుటుంబ సభ్యులతోపాటు మహిళను గాయపరిచిన కేసులో మాజీ సర్పంచ్ భర్తతో పాటు పది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదుకాగా, వారు కొద్ది రోజుల పాటు అరెస్ట్ కాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నట్టు తెలిసింది.
షాడో నేత దెబ్బకు...
జిల్లాలోని షాడోనేత దెబ్బకు ఇద్దరు పోలీసు అధికారులకు సైతం బదిలీలు జరిగాయన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. షాడోనేత చెప్పిన విధంగా అప్పటి ఎస్పీ నవీన్ గులాఠీ హోంగార్డు నియూమకాలు చేపట్టకపోవడంతో బదిలీ చేశారన్న ప్రచారం జరిగింది. జామి ఎస్‌ఐ ఎస్.శ్రీనివాస్ పాత భీమసింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా అన్ని దుకాణాలు ఖాళీచేయించగా స్థానిక కాంగ్రెస్ నేత బడ్డిని తొలగించవద్దని షాడో చెప్పినా వినిపించుకోలేదన్న ఆగ్రహంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వేరొక చోటకు బదిలీ చేయించారు. విజయనగరం డీఎస్పీగా పని చేసిన మేరీప్రశాంతి, సయ్యద్ ఇషాక్ మహమ్మద్ కూడా షాడోనేత ఒత్తిడికి తట్టుకోలేక బదిలీ చేయించుకున్నారన్న ప్రచారం జరిగింది. విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ సమమంలో బదిలీపై వెళ్లిన ముగ్గురు సీఐలు కూడా షాడో ఒత్తిడి వల్ల సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. బదిలీ అవడమే మంచిది అయిందని వారు భావించినట్లుగా తెలుస్తోంది.
అమ్మో విజయనగరం..!!
విజయనగరం వచ్చేందుకు పోలీసు అధికారులు భయపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కావడం వల్ల పోలీసులు ఎక్కువగా ఒత్తిడికి గురువున్నారు. దీంతో జిల్లాకు వచ్చేందుకు పోలీసు అధికారులు భయపడుతున్నారు.
ప్రధానంగా ఒకటో పట్టణ, రెండో పట్టణ, రూరల్, చీపురుపల్లి, భోగాపురం, ఎస్.కోట, బొబ్బిలి సర్కిల్‌ల్లో అధికార పార్టీ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement