
అమ్మ అనాథయ్యింది!
నవమాసాలూ మోసింది..కంటికి రెప్పలా కాపాడింది. తాను పస్తులుండి పెంచి పెద్దవాళ్లను చేసింది.. ప్రేమనిచ్చిన పెనిమిటి దూరమయ్యాడని మతిపోయిన ఆ అమ్మను బిడ్డలు అనాథను చేశారు. లేవలేని స్థితిలో ఒంటరిని చేశారు. తమకు భారమని బతికుండగానే బస్టాండులో వదిలేశారు. 108 సాయంతో ఆస్పత్రికి చేరిన ఆ తల్లి.. చావుకు దగ్గరై నరకయాతన అనుభవిస్తోంది.
- తల్లిని వదిలించుకున్న బిడ్డలు
- 15 రోజులుగా మృత్యువుతో పోరాటం
- ప్రాణభిక్ష పెట్టాలని వేడుకోలు
మదనపల్లె రూరల్ : ఈ వృద్ధురాలి పేరు లక్ష్మీదేవమ్మ(65). ఊరు తెలీయదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు 15 రోజుల క్రితం మదనపల్లె బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లారు. లేవలేని స్థితిలో ఆ తల్లి పడుతున్న కష్టాలు చూసి ఓ వ్యక్తి 108కు సమాచారం అందించాడు. స్పందించిన వారు బాధితురాలిని తీసుకొచ్చి ఏరియా ఆస్పత్రి క్రానిక్ వార్డులో వదిలేశారు. 15 రోజులుగా ఆస్పత్రిలో ఆ తల్లి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తోటి రోగులు ఆరా తీయగా ఆమె వచ్చీ రాని మాటలతో ఇలా చెబుతోంది.. తన పేరు లక్ష్మీదేవమ్మ అనీ.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది.
భర్త 20 సంవత్సరాల క్రితం చనిపోయాడని కన్నీరు పెట్టుకుంది. మతి స్థిమితం కోల్పోవడంతో తను ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పలేక పోతోంది. పిల్లలు పట్టించుకోకపోవడంతోనే ఇలా కష్టాలు పడాల్సి వస్తోందని ఎక్కిళ్లు పెడుతోంది. క్రానిక్ వార్డుకు వచ్చే రోగుల బంధువులు ఆ పండుటాకు దయనీయ స్థితిని చూసి అయ్యో.. పాపం అంటున్నారు. పట్టెడు అన్నం పెట్టడం..శీతల పానీయాలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
వార్డులో ఆమె అనుభవిస్తున్న ఘోర పరిస్థితుల్ని కళ్లారా చూసి వృద్ధాప్యంలో ఇలా వదేలేసిన పిల్లలను శాపనార్థాలు పెడుతున్నారు. అన్నం, నీళ్లు పెట్టే వారు లేక అలమటిస్తోందని, దాతలు ముందుకొచ్చి ప్రాణభిక్ష పెట్టాలని ఆస్పత్రి సిబ్బంది, సహచర రోగులు కోరుతున్నారు. చావుకు దగ్గరవుతున్న ఈమెను వృద్ధాశ్రమంలో చేర్చాలని వేడుకుంటున్నారు.