హిందూపురం (అనంతపురం) : ఆస్తి కోసం కన్నతల్లి మీదే కర్కశంగా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. ఇల్లు తన పేర రాయలేదనే అక్కసుతో కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మెడపై తీవ్రగాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని రహమత్ నగర్‌కు చెందిన షానుబీ(55) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.
కాగా చాలా రోజుల నుంచి ఇంటిని తన పేర రాయమని కుమారుడు అల్లాబక్షు(32) ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరి మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన కొడుకు గొడ్డలితో తల్లి మెడపై వేటు వేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం తల్లిపై గొడ్డలితో దాడి
Published Sat, Aug 1 2015 3:29 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement