తిరుమలలో పాటల మాంత్రికులు
తిరుమల: తిరుమలలో ఆదివారం సినీ గాయినీ, గాయకుల సందడి నెలకొంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గాయకులు మనో, వందేమాతం శ్రీనివాస్, సునీత, శ్రీరామచంద్ర ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మనో మాట్లాడుతూ ప్రజలందరికి మంచి జరగాలని స్వామిని ప్రార్థిం చి నట్లు తెలిపారు. సంగీతాన్ని దేవుడు తనకు ప్రసాదించడం ఎన్నోజన్మల పుణ్యంగా భావిస్తున్నానని చెప్పారు.
వందేమాతం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కళాకారులందరి తరుపున ప్రార్థించినట్టు తెలిపారు. గాయని సునీత మాట్లాడుతూ తిరుమలకు ఎప్పుడు వచ్చినా తెలియని కొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. స్వామి దయతో మంచి పాటలు పాడుతూ తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండడంతో అదృష్టంగా భావిస్తునట్టు చెప్పారు. అంతకుముందు సుప్రభాత సేవలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.