ఎదురుదెబ్బ తగిలితే అమ్మా అని అరిచిన వాళ్లే.. ఎదిగాక ఇంటి నుంచి బయటికి వెళ్లమ్మా అంటూ గొంతెత్తుతున్నారు. జీవన ప్రయాణపు ప్రతి మలుపులో నాన్న తోడు కోరిన బిడ్డలు.. ఆయన చివరి మజిలీలో కఠిన పాషాణాలుగా మారుతున్నారు. ఆకాశమంత ఆత్మీయత పంచిన తల్లిదండ్రులను అక్కున చేర్చుకోవాల్సిన సమయంలో పాతాళమంత స్వార్థపు లోతుల్లోకి తోసేస్తున్నారు. బిడ్డల ఆకలి తీరితే తాము కడుపు నిండిందని సంబరపడిన తల్లిదండ్రులకు.. జీవిత చరమాంకంలోనూ ఎండిన డొక్కలు మిగుల్చుతున్నారు. అమ్మానాన్నల ప్రేమను ఆస్తిపాస్తులతో విలువకట్టి.. మానవ బంధాలకు నడిరోడ్డుపై సమాధి కడుతున్నారు.
సాక్షి, గుంటూరు: ఆస్తి కోసం ఒకడు.. పంతంతో మరొకడు.. కొడలి మాట విని కొడుకు.. అల్లుడు వద్దన్నాడని కూతురు ఇలా కారణం ఏదైనా కన్నవారికి మాత్రం అది శాపంగానే మారుతోంది. పేగు పంచుకున్న వాళ్లే రోడ్డు మీదకు నెట్టేస్తున్నారు. అందుకే ‘ఆత్మీయత, అనుబంధాలన్నీ బూటకం, నాటకం’ అని ఓ కవి ముందే చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో అవే నిజమవుతున్నాయి. ఆస్తి కోసం, పంతాల కోసం కన్న తల్లిదండ్రులనే రోడ్డున పడేసే పిల్లలు తయారవుతున్నారు. ఫలితం ఆఖరి మజిలీలో నా అన్నవారి నడుమ ఆనందంగా గడవాల్సిన వృద్ధాప్యం అగమ్యగోచరంగా మారుతోంది. కూడూ, గూడూ కరువై, దుఃఖాన్ని దిగమింగుతూ అనారోగ్యంతో వృద్ధాప్యం నలిగిపోతోంది.
లెక్కలేనన్ని ఫిర్యాదులు..
జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజావాణి వేదికగా కలెక్టర్, ఎస్పీలకు లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. సంపాదించినన్ని రోజులు తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్న పిల్లలు.. శరీరం సహకరించక మంచాన పడిన వెంటనే ఆస్తులు రాసి ఇవ్వమంటూ వే«ధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉన్నదంతా రాసిచ్చి రోడ్డున పడుతుంటే, మరికొందరు కాపాడమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఆస్తి కోసం కన్న వారినేహతమారుస్తున్నారు..
ఆస్తి కోసం తల్లిదండ్రులను కూతురు హత్య చేయించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. చేబ్రోలుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి షేక్ ఖాశీం దంపతులను కూతురు మస్తాని ఆస్తి కోసం హత్య చేయించింది. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే పెన్షన్ కోసం కొందరు కన్నవారిని బాగా చూసుకుంటుంటే, అది లేని వారి పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారుతోంది. డబ్బు వ్యామోహంలో పడి కొందరు అమ్మా నాన్నలను ఇంటి నుంచి తరిమేస్తుంటే.. మరికొందరు ఇంట్లోనే ప్రత్యేక్ష నరకం చూపిస్తున్నారు. తట్టుకోలేని వృద్ధ దంపతులు కడుపున పుట్టిన వారికి భారం కాకూడదని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో బయటకు రావడంలేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
జిల్లాలో పెరుగుతున్న వృద్ధాశ్రమాలు..
కన్నబిడ్డలు సూటిపోటి మాటలతో వేధిస్తూ ఇంటి నుంచి తరిమేస్తుంటే కొందరు వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది మంచాన పడిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదలి పండగలకు, ఏడాదికి ఒకసారి రెండు సార్లు వచ్చి చుట్టం చూపుగా చూసి పోతున్నారు. ఆర్థిక స్తోమత లేని వృద్ధులు రోడ్లపై బిక్షాటన చేసుకుంటు బతుకీడుస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, మానవతా వాదులు వారిని చేరదీసి ఓల్డేజ్‌హోమ్‌లో చేరుస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం సమయానికి పింఛన్ అందక ఎందరో పండుటాకులు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఆ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
తల్లిదండ్రులను వేధిస్తే శిక్ష తప్పదు.
తల్లిదండ్రు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వారి సంక్షేమాన్ని పట్టించుకోకుండా వేధింపులకు గురి చేసే వారికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం మూడు నెలల జైలు శిక్ష పడుతుంది. ఈ శిక్షను ఆరు నెలలకు పెంచాలని కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే పెద్దలకు జీవన వ్యయం చెల్లించని సంతానానికి నెల వరకు జైలు శిక్ష విధించే అధికారాన్ని ట్రైబ్యునళ్లకు కల్పించాలనుకుంటోంది. – లక్ష్మీరెడ్డి, న్యాయవాది, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment