మనవళ్లతో వృద్ధురాలు అప్పమ్మ
సాక్షి, గుంటూరు: జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్నారు. దాచేపల్లికి చెందిన మారిశెట్టి అప్పమ్మ, కోటయ్య వృద్ధ దంపతులు కొన్నేళ్లుగా దాచేపల్లి పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. దీంతో అప్పమ్మ తమ్ముడు ఎలిశెట్టి వెంకటేశ్వర్లు కుమారుడు అప్పారావు మాయమాటలు చెప్పి రెండేళ్ల క్రితం వారి పేరుతో రెండు ఎకరాల పొలం, దాచేపల్లి రహదారి పక్కనే ఉన్న రెండు షాపులను నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని అప్పమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాలు ఆ మాటల్లోనే....
నా భర్త కోటయ్యకు వారి పెద్దల నుంచి రెండెకరాల పొలం(సర్వే నెం–1253/3), రెండు షాపులు సంక్రమించాయి. నా తమ్ముని కుమారుడు(మేనల్లుడు) అప్పారావు రెండెళ్ల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పొలం పాసు పుస్తకాలు దొంగలించారు. నా భర్త సంతకం, నా సంతకం ఫోర్జరీ చేసి తన భార్య పేరుతో నకిలి పాసు బుక్కులు సృష్టించాడు. ఈ విషయంపై మేము ఆర్‌డీవోకు ఫిర్యాదు చేయగా... ఆయన విచారణ చేసి పొలం మాకే చెందుతుందని గత ఏడాది ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ సైతం అప్పారావు సృష్టించిన నకిలి పాసు బుక్కులపై ఎలాంటి లోన్లు ఇవ్వద్దని బ్యాంకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు అప్పారావు పంచాయతీ ఈవో సహాయంతో రహదారి పక్కన ఉన్న మా రెండు షాపులకు అతని పేరుతో రెండు సంవత్సరాల ఇంటి పన్ను బిల్లులు సృష్టించాడు. వాటì ఆధారంగా ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభించే ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ రోజు నేను అడ్డుపడటంతో అప్పారావు, అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు.
అధికార పార్టీ నేతల అండతోనే..
స్థానిక అధికార పార్టీ నేత ముఖ్య అనుచరులు, మండల స్థాయి నేతల అండతో అప్పారావు నాలుగుకోట్ల విలువ గల నా ఆస్తులను ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో మనస్థాపానికి గురై నా భర్త కోటయ్య మంచాన పడి నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. ఇటీవల నా షాపుల్లో టీడీపీ ఆఫీసు ప్రారంభాన్ని అడ్డుకున్నానే కక్షతో నా మేనల్లుడు అప్పారావు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి నాపై దాడికి యత్నించాడు. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటి వరకూ రెండు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు నాకు ఎటువంటి న్యాయం చెయ్యలేదు. అతనికి అండగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులపై రాజకీయ ఒత్తిడి తీసుకు వచ్చి అప్పారావును రక్షిస్తున్నారు. రెండెకరాల పొలం కౌలుకు ఇచ్చి నేను నా భర్త ఆ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండే వాళ్లం. మనస్తాపంతో ఇటీవల నా భర్త మరణించాడు. రెండేళ్లుగా పొలం కౌలుకు కూడా ఇవ్వకపోవడంతో పాటు షాపులు కూడా ఖాళీగా ఉన్నాయి. అందులోకి ఎవరిని అద్దెకు రాకుండా చేస్తున్నారు. నాకు జీవనాధారం లేకుండా పోయింది. నా భర్త తమ్ముడి కుమారుల దగ్గర ప్రస్తుతం ఉంటున్నాను. నాకు రక్షణ ఉండి అధికార పార్టీ నేతల అన్యాయాలను ప్రశ్నిస్తున్నారని చెప్పి నా మనవళ్లపై అక్రమ కేసులు పెడతామని పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.
ఆస్తి కోసం ఆశపడిచేస్తున్నాడు
నా తమ్ముడు ఆస్తి కోసం ఆశపడి మా మేనత్త పొలం, షాపులపై నకిలీ ధ్రువపత్రాలు, బిల్లులు సృష్టించి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అతనికి అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యే అనుచరులు అండగా ఉన్నారు. వారే వెనుకుండి ఇవన్ని చేయిస్తున్నారు. అధికారుల స్పందించి న్యాయం చేయాలి. ఆమెకు ఆ పొలం షాపులే జీవనాధారం. – పిచ్చయ్య, అప్పారావు సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment