డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎస్‌ఓటీ
ముగ్గురి అరెస్టు.. రూ.10 లక్షల ఎపిడ్రిన్ స్వాధీనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి ముంబైకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువైన ఎపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువులోని సన్ వే కెమికల్ ఫ్యాక్టరీ, ఖాజీపల్లిలోని ఎస్‌పీఎల్ కెమికల్ ఫ్యాక్టరీలలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న దమ్మిడి శ్రీనివాస్ (గుంటూరు జిల్లా), కోటిరెడ్డి, రాజేంద్రనగర్‌లో వ్యాపారం చేస్తున్న త్రిలోక్‌నాథ్ యాదవ్ స్నేహితులు. శ్రీనివాస్ పనిచేస్తున్న కంపెనీ రెండేళ్ల క్రితం మూసివేయడంతో అందులో ఉన్న ఎపిడ్రిన్ మత్తుమందును అతడు దొంగిలించి ఇంట్లో నిల్వచేశాడు.
తర్వాత స్నేహితులతో కలిసి దానిని ముంబైకి, నగరంలోని పలు పబ్బులు, హుక్కా సెంటర్లకూ సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైకి డ్రగ్‌ను రవాణా చేసేందుకు రాజేంద్రనగర్ పీడీపీ చౌరస్తా వద్దకు వచ్చిన వీరు ముగ్గురినీ పోలీసులు పట్టుకున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా వీరు డ్రగ్స్ సరఫరా చేశారని, వీరి వెనక మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.