మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్: సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తమవంతు కృషి చేశామని, అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం ఆయా గ్రామాలు పోలీసుల అధీనంలోకి వచ్చాయని తెలిపారు. బుధవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా గ్రామాల్లో పర్యటించామన్నారు. శాంతియుత పోలింగ్‌కు సహకరించాలని గ్రామస్తులను కోరామన్నారు. ఎన్నికల్లో సమస్యలు సృష్టించకుండా 36834 మందిని బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 409 పాత ఎన్బీడబ్ల్యూలు అమలు చేశారని, ఈ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు ఆయుధ లైసెన్సులు కలిగిన వారి నుంచి 998 తుపాకులను డిపాజిట్ చేయించామని వివరించారు.
2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి బందోబస్తుకు సిబ్బందిని తక్కువగా వినియోగించామన్నారు. జిల్లాలో ఉన్న సిబ్బంది కాకుండా గత ఎన్నికల్లో బయట నుంచి వచ్చిన సివిల్ పోలీసు సిబ్బందిలో 30 శాతం మాత్రమే ఈసారి వచ్చారని తెలిపారు. తాడిపత్రి మండలం వీరాపురం ఘటన మినహా మిగతావన్నీ చెదురుమదురు ఘటనలేనన్నారు. అది కూడా దురదృష్టవశాత్తు జరిగిందని విచారం వ్యక్తం చేశారు. పోలింగ్ మునుపు, తర్వాత 68 ఐపీసీ కేసులు నమోదు చేసి 400 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడంపై 290 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 3.77 కోట్ల నగదు, రూ.7.12 కోట్ల బంగారు, వెండి సామగ్రిని పట్టుకున్నామన్నారు. గత ఎన్నికల్లో రూ.6.75 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలచే మూడెంచల పటిష్ట భద్రత చేపట్టినట్లు ప్రకటించారు. పోలింగ్ తర్వాత ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాల్లో గొడవలు జరగకుండా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment