మాధవరం చెక్‌పోస్ట్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలిన్తున్న ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు/మంత్రాలయం రూరల్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న మాధవరం చెక్‌పోస్ట్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీజ్ చేసిన వాహనాలను ఎలా విడుదల చేయాలో రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలను సీజ్ చేశారో యజమానులు అక్కడికే వెళ్లి అండర్‌టేకింగ్ రాసివ్వాల్సి ఉంటుందన్నారు.
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఎస్‌ఈబీ పరిధిలో పనిచేస్తాయి
మద్యం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ)ను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోసి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు కూడా ఎస్‌ఈబీ పరిధిలో పనిచేస్తాయన్నారు. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఎస్‌ఈబీ టీం కలిసి సమన్వయంతో అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తాయన్నారు. నాలుగు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. అక్రమ రవాణా కట్టడికి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక భద్రతతో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి నేతృత్వంలో అక్రమ రవాణా కట్టడికి ఎస్‌ఈబీ ప్రత్యేకంగా పని చేస్తుందన్నారు. ఎస్‌ఈబీ పనితీరు గురించి అక్కడ విధులు నిర్వహిస్తున్నవారిని అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో కేసుల నయోదు సంఖ్య నామమాత్రమేనన్నారు. 14 కంటైన్మెంమెంట్ జోన్లలో 28 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో వాటిని గ్రీన్ జోన్లుగా మార్చామన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో మాత్రమే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. 433 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారని గుర్తు చేశారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు జిల్లాలో ప్రభుత్వం జారీచేసిన ఆంక్షలు కొనసాగుతాయన్నారు. మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ వేణుగోపాల్, ఎక్సైజ్ సీఐ రామ్మోహన్ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment