ఎస్పీ రాహుల్‌దేవ్‌పై వేటు వేసిన ఎన్నికల సంఘం | SP Rahul Dev Sharma Suspended By Election Commission | Sakshi
Sakshi News home page

ఎస్పీ రాహుల్‌దేవ్‌పై వేటు వేసిన ఎన్నికల సంఘం

Published Wed, Mar 27 2019 10:46 AM | Last Updated on Wed, Mar 27 2019 11:37 AM

SP Rahul Dev Sharma Suspended By Election Commission - Sakshi

సాక్షి, కడప: కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మపై ఎన్నికల కమిషను వేటు పడింది. కమిషన్‌కు లోబడి విధి నిర్వహణ లేకపోవడం, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దిశా–నిర్దేశం అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించింది. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించింది. 2011 బ్యాచ్‌కు చెందిన రాహుల్‌దేవ్‌ శర్మ ఫిబ్రవరి 18న కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి విధుల్లో ఉండగా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆయన ఉంటే ఎన్నికల్లో కష్టమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు.

గత ఏడాది నవంబర్‌ 2న జాయిన్‌ అయిన ఆయన్ను కేవలం 102 రోజులకు ఫిబ్రవరి14న బదిలీ చేయించారు. అనతి కాలంలోనే అభిషేక్‌ మహంతి తనదైన శైలిని రాజకీయ నేతలకు రుచిచూపించారు. జిల్లాలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధ్దంగా నిర్వహిస్తారని భావించిన తరుణంలో అభిషేక్‌మహంతిని పట్టుబట్టి బదిలీ చేయించారు.  ఆ స్థానంలో వచ్చిన రాహుల్‌దేవ్‌శర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. రాహుల్‌దేవ్‌ శర్మ విశాఖపట్నం రూరల్‌ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తుండగా ఎమ్మెల్యే కిడారి వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైయ్యారు.

అక్కడి నుంచి కడప ఎస్పీగా బదిలీపై వచ్చిన రాహుల్‌దేవ్‌ శర్మ విధులో చేరిన నెలలోపు మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి మార్చి 15న దారుణహత్యకు గురైయ్యారు. మన్యంలో మావో యిస్టుల చేతిలో ఎమ్మెల్యే హత్యకు గురైన ఘటన, కడపలో మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటన రాహుల్‌దేవ్‌శర్మ హయాంలో చోటుచేసుకున్నవే కావడం విశేషం. వివేకానందరెడ్డి హత్య అనంతరం ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ తన నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను వేధింపులకు గురిచేస్తూ వచ్చారు.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్షన్‌ మేరకు కడప డీపీఓ యాక్షన్‌ చేస్తూ వచ్చింది. ఈతరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా హత్యానంతరం ఆయన కుటుంబ సభ్యులను.., సన్నిహితులను వేధింపులకు గురిచేస్తుండంపై హతుని కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో విచారించి ప్రా«థమిక అంచనాకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్‌శర్మను బాధ్యతల నుంచి తప్పించారు.  రాష్ట్ర హెడ్‌ క్వార్టర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement