కర్నూలు, న్యూస్‌లైన్: నిజాయితీ.. నిరంకుశత్వం మధ్య పోరాటం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ మరో రెండు వారాలు వాయిదా పడింది. శాంతి భద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పని చేస్తున్న ఆయనను స్వార్థ రాజకీయాలు బదిలీతో సన్మానించడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు తీసుకొని మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఆ మేరకు ఆయన సమర్థవంతమైన అధికారి అయినందునే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం బుధవారం నివేదించింది. అందుకు క్యాట్ సంతృప్తి చెందకపోగా కర్నూలు జిల్లాకు సమర్థుడైన అధికారి అవసరం లేదా అంటూ ప్రశ్నించింది. బదిలీకి స్పష్టమైన కారణాలను తెలపాలని కోరింది. అందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో అప్పటి వరకు ఎస్పీని కర్నూలులోనే కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఇదిలాఉండగా రఘురామిరెడ్డి జిల్లాను వదిలి వెళుతున్నారని ఇప్పటి వరకు సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులకు ఈ విషయం మింగుడుపడటం లేదు.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కూడా ఎస్పీ బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫలితంగా ఈ విషయం అధికార పార్టీని కుదిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలో ఇరువురు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. తనను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఓ జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఆయన బాగానే పని చేస్తున్నారు కదా.. ఎందుకు బదిలీ చేయాలి. మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతా’నంటూ సన్నిహితులతో కోట్ల అన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎస్పీకి మద్దతుగా మూడు రోజుల నుంచి ప్రజలు, ప్రజాసంఘాలు అండగా నిలుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా క్యాట్‌లో తీర్పు వచ్చిన విషయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.