
క్రికెట్ పండగొచ్చింది
► ఫ్యాన్ పార్కుకు సర్వం సిద్ధం
► ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు
► ప్రవేశం ఉచితం
విజయవాడ స్పోర్ట్స్ : రెండు రోజుల పాటు ఐపీఎల్ ఫ్యాన్ పార్కు పండగ నగరంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు అంతా సిద్ధమైంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవేశం ఉచితం. కనీసం 10వేల మంది క్రికెట్ అభిమానులు ఫ్యాన్ పార్కుకు హాజరై వైజాగ్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ను లైవ్ స్క్రీన్‌లో చూడాలని బీసీసీఐ భావి స్తోంది. దేశవ్యాప్తంగా బీహార్‌లోని ముజఫ్ఫాపూర్, మహారాష్ట్రలోని కొలహాపూర్, విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ ఫ్యాన్ పార్కును ఏర్పాటు చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫ్యాన్ పార్కులకు 1,45,000 మంది ప్రేక్షకులు హాజరైనట్లు బీసీసీఐ చెబుతోంది.
అసలు ఫ్యాన్ పార్కు అంటే..
ఏ స్థాయి క్రికెట్ మ్యాచ్ అయినా పలు కారణాల వల్ల కోట్లాది క్రికెట్ అభిమానులు చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లోని ప్రజలకు ప్రత్యక్షంగా చూసే వీలుండదు. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోని క్రికెట్ స్టేడియాలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పనికిరావు. అయితే, ఈ ప్రాంతాల్లో లక్షలాది మందిక్రికెట్ అభిమానులు ఉంటారు. ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేని స్టేడియాలున్న నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కును బీసీసీఐ దేశవ్యాప్తంగా 36 నగరాల్లో ఏర్పాటుచేసింది. రోజుకు మూడు నుంచి నాలుగు నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కు ఏర్పాటుచేసి భారీ స్క్రీన్ ద్వారా లైవ్ మ్యాచ్‌లు చూపిస్తుంది.
స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఫ్యాన్ పార్కులో గ్రీన్ కార్పెట్ పరిచారు. చుట్టూ ఫుడ్‌కోర్టు స్టాల్స్, వీఐపీలకు లాంజ్ ఏర్పాటుచేశారు. భారీ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్, ఆడుకునేందుకు వర్చ్యు వల్ క్రికెట్ స్టాల్ సిద్ధమైంది. అందరూ గ్రీన్ కార్పెట్‌పై కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని పలు కూడళ్లలో లక్కీడిప్ కూపన్లు పంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రారంభిస్తారు. మూడు గంటలకు ప్రవేశం కల్పిస్తారు. ప్రతి ఒక్కరికీ రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. విలువైన వస్తువులు లోనికి తీసుకురాకూడదు. వొడాఫోన్ జుజూలు ఈ ప్రాం తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. లక్కీ కూపన్లను లక్కీడిప్‌లో వేయాలి. డ్రాలో ఎవరిని వరిస్తే వారికి ఆయా క్రికెటర్లు వాడిన బ్యాట్, ఫోన్ బహూకరిస్తారు.