వెంకయ్య నాయుడు
విజయవాడ: రాజధాని నగరానికి కొన్ని హంగులు, ఆకర్షణలు, కొన్ని ప్రత్యేకతలతోపాటు వసతులు ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అలాలేకపోతే రాజధాని నిలబడదని అన్నారు. రాజధాని విషయంలో కొంతమంది అపరిపక్వతతో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రపంచం చాలా ముందుకు వెళుతోందన్నారు. ఈమధ్యకాలంలో తాను విదేశాలకు వెళ్లి చూశానని చెప్పారు. రాజధాని అనగానే సచివాలయం, హైకోర్టు, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్లు అని కొందరు అనుకుంటున్నారు. అలా అని భావిస్తే, పని ఉన్నవారు తప్ప రాజధానికి ఎవరూ రారని చెప్పారు. అలారాకపోతే పెట్టుబడులు రావన్నారు. పర్యాటన కూడా ఎక్కువగా జరగదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆయా ప్రాంతాలలో ఏదోఒకరి రావాలని చెప్పారు. ఈ విషయమై చంద్రబాబుతో తరచూ మాట్లాడుతున్నానన్నారు. ఆయన కూడా అదేదిశగా ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు.
రాజధానిలో విద్య, ఉపాధి, వినోదం, ఆర్థిక కార్యకలాపాలు ఉండాలని తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో సాయంత్రం అయ్యేసరికి ఎవ్వరూ ఉండరని చెప్పారు. ప్రజల మైడ్సెట్ అలా ఉంటుందన్నారు. రాజధాని ఇప్పుడు ఉన్నప్రాంతంలో వద్దంటే, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టవచ్చునని అన్నారు. అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని అనకపోతే ఈ ప్రాంతంలో అంత ధర వచ్చేదా? అని ప్రశ్నించారు. విజయవాడలో రేట్లు చూస్తే న్యూయార్కు, శాన్ఫ్రాన్సిస్కో రేట్లు ఉన్నాయని తెలిపారు. తుళ్లూరులో కూడా ఇప్పుడు రేట్లు అలానే ఉన్నాయని అన్నారు. మధ్యలో ఉన్నవారు కల్పించే భ్రమల్లోపడకండి అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. వారు జీవనాధారాన్ని కోల్పోతారని, అందువల్ల సరిపడా పరిహారం ఇవ్వాలని వెంకయ్యనాయుడు అన్నారు.
**