పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ | Special care on PHC | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ

Published Sun, Jan 4 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ

పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ

 జలుబు లేదా జ్వరమొస్తే రూ.వందలు.. ఇంకొంచెం పెద్ద ఆరోగ్య సమస్య అరుుతే రూ.వేలకు వేలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అయ్యే ఖర్చులివి. ఇంత ఖర్చుకు మధ్య తరగతి ప్రజలే కాదు.. సంపన్నులూ వెనుకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులకు మొదట గుర్తుకువచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. అక్కడ వైద్య పరీక్షలే కాదు మందులూ ఉచితం. అయితే పీహెచ్‌సీల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని పీహెచ్‌సీల తీరు ఎలా ఉంది.. ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలి వంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నారు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద. ఇందుకు ‘సాక్షి’ని వేదికగా చేసుకున్నారు. వీఐపీ రిపోర్టర్‌గా నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను, స్కానింగ్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. తొలుత తంగెళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లిన డాక్టర్ సునంద అక్కడి పరిస్థితులను గమనించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరు, వైద్యులు, సిబ్బంది వైఖరిపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
 
 సునంద : ఈ కేంద్రానికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. గర్భిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారా
 డాక్టర్ కె.మిద్దేశ్వరరావు : రోజుకు 30 నుంచి 50 మంది రోగులు వస్తుంటారు మేడమ్. గర్భిణుల వివరాలతో రికార్డులు నిర్వహిస్తున్నాం. ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం.
 సునంద : గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుళ్లు పోస్తున్నారా.. బయటకు పంపుతున్నారా
 మిద్దేశ్వరరావు : మా కేంద్రానికి వచ్చే గర్భిణులందరినీ 9 నెలలపాటు జగ్రత్తగా పరిశీలిస్తూ ఇక్కడే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తున్నాం.
 సునంద : ఇక్కడ అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచుతున్నారా.
 కె.విజయ, నర్సు : అన్ని మందులూ ఉన్నాయి మేడమ్. ఈ ప్రాంతం మురికివాడ కావడంతో
 
 ఎక్కువ మంది కుక్క కాటుకు గురై వైద్యం కోసం వస్తున్నారు. యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు మేడమ్.
 సునంద : అర్బన్ హెల్త్ సెంటర్లలో యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం కష్టం. వాటిని శీతల ప్రదేశంలో ఉంచాల్సి ఉన్నందున్న ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి బాధితులను అక్కడికి పంపించాలి.
 అనంతరం టాయిలెట్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన డీఎంహెచ్‌వో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ స్వీపర్ ఎవరని ప్రశ్నించారు.
 కొప్పుల రామలక్ష్మి : నేను ఇక్కడ స్వీపర్‌గా పనిచేస్తున్నాను మేడమ్.
 సునంద : టాయిలెట్లు ఇంత మురికిగా ఉన్నాయేంటి. నీరుకూడా వృథాగా పోతోంది.
 రామలక్ష్మి : ఎప్పుడూ కడుగుతూనే ఉంటానండి.  రోగులు వచ్చి వినియోగించుకుంటారు కదాండి. అందుకే మురికిగా ఉన్నాయి. మరింత శుభ్రంగా ఉంచుతాను మేడమ్.
 సునంద : నీరు వృథాగా పోతోంది కదా. పంపులను జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడూ పరిశీలిస్తుండాలి.
 రామలక్ష్మి : అలాగేనండి.
 ఆ తర్వాత అక్కడున్న కమ్యూనిటీ ఆర్గనైజర్‌తో డీఎంహెచ్‌వో మాట్లాడారు.
 ఎంబీ విజయసత్యకళ, సీవో : ప్రతినెలా జీతాలు అందడం లేదు మేడమ్. ఏ నెల జీతాలు ఆ నెలలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి.
 సునంద : ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి. బడ్జెట్ విడుదల కాగానే జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
 అక్కడి నుండి నగరం నడిబొడ్డులోని రామచంద్రరావు పేటలో గల వంశీ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన సునంద ఆ సెంటర్ నిర్వాహకురాలిని అక్కడ ఏయే పరీక్షలు చేస్తున్నారు, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
 ఎన్.మృణాళిని : మేడమ్. ఇక్కడ నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నాను.
 సునంద : అందుకు సంబంధించి మీ అర్హత ఏమిటి. బయట బోర్డు పెట్టారా. మీ పత్రాలు చూపండి.
 మృణాళిని : రిజిస్ట్రేషన్ చేయించాం మేడమ్. బయట బోర్డు కూడా ఉంది.
 సునంద : ఇక్కడ స్కానింగ్‌లు చేస్తున్నారా. ఎంత వసూలు చేస్తున్నారు.
 మృణాళిని : అన్నిరకాల స్కానింగ్‌లూ చేస్తున్నాం మేడమ్. లింగ నిర్థారణ ప్రకటించడం లేదు.
 సునంద : రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు.
 మృణాళిని : గర్భస్థ శిశు పరీక్షలు కాకుండా ఇతర స్కానింగ్‌లు సుమారు 30 నుంచి 40 వరకూ చేస్తాం.
 సునంద : మీరు చేసే అన్ని పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు మాకు నివేదిక పంపాలి. వైద్యుల సూచనల మేరకు వస్తున్న రోగులకే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వచ్చేవారికి కూడా పరీక్షలు చేస్తున్నారా.
 మృణాళిని : లేదు మేడమ్. డాక్టర్లు పంపిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఎంహెచ్‌వో పరీక్షల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు.
 సునంద : ఏమ్మా.. ఏ పరీక్ష కోసం వచ్చారు.
 ఫాతిమా : కడుపునొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన స్కానింగ్ చేయించుకు రమ్మని పంపారు.
 సునంద :  ఏ వైద్యుడు పంపారు. ఆ చీటీ ఏది.
 ఫాతిమా : చీటీ నా దగ్గర లేదండి. నా భర్త వద్ద ఉంది. ఆయన బయటకు వెళ్లారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement