అర్బన్ హెల్త్‌సెంటర్లలో ప్రైవేట్ వైద్యం..!
అర్బన్ హెల్త్‌సెంటర్లలో ప్రైవేట్ వైద్యం..!
Published Sun, Jul 24 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
– గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
– ఎన్‌జీవోల నుంచి హెల్త్‌సెంటర్ల స్వాధీనం
–ఆగస్టు ఒకటి నుంచి ప్రై వేట్ చేతుల్లోకి
కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అర్బన్‌హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రై వేటుపరం చేయనుంది. ఆధునిక వైద్యసేవల పేరుతో పీపీపీ విధానంలో వీటిని ప్రై వేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా అర్బన్‌హెల్త్ సెంటర్లను ఎన్‌జీవోల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయమై కొంత మంది ఎన్‌జీవోలు కోర్టును ఆశ్రయించారు.
జిల్లాలో కర్నూలు నగరంలో 8, ఆదోనిలో 4, నంద్యాలలో 5 అర్బన్‌హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రతి సెంటర్‌లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక కో ఆర్డినేటర్, ఒక వాచ్‌మెన్, స్వీపర్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉంటారు. మెడికల్ ఆఫీసర్‌కు రూ.18వేలు, ఏఎన్‌ఎంలకు రూ.10వేలు, కో ఆర్డినేటర్‌కు రూ.9వేలు, ఇతర ఉద్యోగులకు రూ.4,900ల చొప్పున జీతాలు ఇస్తారు. ఇవి గాక సెంటర్ కంటింజెన్సీ కింద నెలకు రూ.3వేలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.2వేలు, అద్దెభవనంలో ఉంటే అద్దె రూ.2వేలు చెల్లిస్తారు. ఈ సెంటర్లను జిల్లాలో ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ వచ్చాయి. వీటి పనితీరు బాగాలేదని, మురికివాడల్లో ప్రజలకు కనీస వైద్యం అందడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రై వేటు సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా ఆయా సెంటర్లను స్వచ్ఛంద సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెంటర్లు నిర్వహించే ఎన్‌జీవోలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నోటీసులు పంపించింది. ఇప్పటికే పలు కేంద్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఏప్రిల్ నుంచి జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను సైతం ఇవ్వకుండా నిలిపివేశారు. కేవలం మందులు మాత్రమే ఏపీఎంఎస్‌ఐడిసి డ్రగ్‌స్టోర్ నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఎన్‌జీవో ద్వారా గాకుండా డీఎంహెచ్‌వో కార్యాలయంతో అక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యులుగా ఉంటున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రై వేటు సంస్థలు వీటిని నిర్వహించే విధంగా ప్రభుత్వం విధివిదానాలు రూపొందించనున్నట్లు సమాచారం.
సెంటర్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నాం
–డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో కర్నూలు
అర్బన్‌హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎన్‌జీవోలందరికీ టెర్నినేషన్ ఆర్డర్స్ ఇచ్చాం. వాటిని డిప్యూటీ డీఎంహెచ్‌వోల ద్వారా ప్రస్తుతానికి నడిపించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు వాటిని నడిపిస్తునాం. ఈ విషయమై కొందరు కోర్టుకు వెళ్లారు. వాటిని ప్రై వేటు సంస్థలకు ఇస్తుందనే విషయం మాకు సమాచారం రాలేదు.
Advertisement