
కస్టడీకి తీసుకున్న నిందితుడు శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్న సిబ్బంది
సంచలనం కోసమే నిందితుడితో డ్రామా నడిపించారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన పోలీసులు..చివరకు అది హత్యాయత్నమేనని అంగీకరించక తప్పలేదు. ప్రతిపక్ష నేతకు అదృష్టవశాత్తూ ముప్పు తప్పిందని, కత్తి పోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆదివారం మీడియాతో చెప్పారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో కొన్ని పంక్తులివి..
‘‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గత గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి హత్యాయత్నమే. వైఎస్ జగన్ అదృష్టవశ్తాతూ యాధృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ప్రాణానికి ముప్పు తప్పింది. ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావు. దుండగుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్‌ను హతమార్చాలనే దాడి చేశాడు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి... వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు బలవంతంగా అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.’’
ఇంకా రిమాండ్ రిపోర్ట్‌లో విభ్రాంతికరమైన విషయాలు మరెన్నో ఉన్నాయి. కోర్టు అనుమతితో నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం పోలీస్ కస్టడీకి తరలించారు. సీపీ మహేష్‌చంద్ర లడ్డా, సిట్ ఇన్‌చార్జి నాగేశ్వరరావులు అతనితో పాటు మొత్తం 12మందిని విచారించారు. నిందితుడు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని, ఏమి అడిగినా లేఖలో అంతా పేర్కొన్నాను.. చదువుకోమని చెబుతున్నాడని తెలుస్తోంది. నిందితుడి నుంచి4 సెల్‌ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలపై సోమవారం విచారణ కొనసాగిస్తారు.
సాక్షి,విశాఖపట్నం/ఎన్‌ఎడీ జంక్షన్: మామూలూగానే ఆ స్టేషన్‌లో క్రైం రేటు తక్కువ.. ఇక ఆదివారం అయితే ఆ స్టేషన్ వైపు కన్నెత్తి చూసే వారే ఉండరు. అలాంటిది ఆదివారం రోజంతా ఆ స్టేషన్‌లో ఒకటే హడావుడి. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మొత్తం ఆ స్టేషన్ ఎదుటే మోహరించింది. మరోవైపు ఒకరి వెంట మరొకరుగా పోలీస్ ఉన్నతాధికారుల రాక.. పోలీసుల ఉరుకులు.. పరుగులు... విచారణ పేరుతో గంటకొకరు స్టేషన్‌కు రావడంతో ఏం జరుగుతుందోనని ఒకటే టెన్షన్. మరో వైపు ఆ స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంత ప్రజలు గుమిగూడి చర్చించుకోవడం కనిపించింది.
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీలాంజ్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సాగుతోంది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడంతో స్టేషన్ పరిసరాల్లో ఎప్పుడు లేనంత హడావుడి కనిపించింది. కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని తీసుకువస్తున్న సమయంలో స్టేషన్ వద్ద పోలీసులతో పహారా కాశారు. మరో వైపు విచారణకు వేదికైన స్టేషన్‌కు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చానల్స్ లైవ్ వెహికల్స్‌తో తరలి వచ్చారు. అలాగే ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో స్టేషన్ పరిసరాలు నిండిపోయాయి. ఉదయం 11.45 గంటల సమయంలో నిందితునితో స్టేషన్‌కు పోలీస్ రక్షక్ వెహికల్ చేరుకోగా... ఫొటోలు తీసేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కెమెరామెన్‌లు పోటీపడ్డారు. ఆ తర్వాత బందోబస్తు మధ్య స్టేషన్‌లోని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రూమ్‌లోకి తీసుకొచ్చారు. అప్పటికే స్టేషన్‌లో సిట్‌కు సారధ్యం వహిస్తున్న బీవీఎస్ నాగేశ్వరరావు, డీసీపీ ఫకీరప్పలున్నారు.
12 గంటలకు విచారణ ప్రారంభం
కొద్ది సేపటికే విశాఖ సిటీ పోలీస్‌క మిషనర్ మహేష్‌చంద్ర లడ్డా సివిల్ డ్రస్‌లో స్టేషన్‌కు చేరుకోవడంతో విచారణ మొదలైంది. నిన్ననే అదుపులో తీసుకున్న నిందితుడు శ్రీనివాసరావు సహచర సిబ్బంది రమాదేవి, స్నేహితుడు రేవతిపతి, ఫ్లెక్సీ ఓనర్ చైతన్య తదితరులతో కలిసి విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు నిందితునిపై ప్రశ్నల పరంపర కొనసాగింది. అన్నింటికి ఒక్కటే మందు అన్నట్టుగా నేను చెప్పాల్సింది ఆ లేఖలోనే ఉందంటూ విచారణలో నిందితుడు పదే పదే చెప్పడంతో అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకరి తర్వాత ఒకరిగా అతని స్నేహితులను కూడా స్టేషన్‌కు రప్పించి విచారణ సాగించారు. దీంతో స్టేషన్‌కు వస్తున్న వారిలో ఎవరు నిందితులో.. ఎవరు సాక్షులో తెలియక మీడియా ఒకింత అయోమయానికి గురైంది.
తమ సిబ్బందిని వెంటపెట్టుకుని విచారణకు వస్తున్నఫ్యూజన్ ఫుడ్స్ అధినేత, టీడీపీ నేత హర్షవర్ధన్
బిర్యానీ కావాలన్న శ్రీనివాస్
మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన సీపీ మహేష్ చంద్ర లడ్డా, డీసీపీ ఫకీరప్పలు భోజనానికి తమ క్యాంపు కార్యాలయాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తింటావ్ అని నిందితుడు శ్రీనివాసరావును ప్రశ్నించగా.. బిర్యాని కావాలని అడిగాడని చెబుతున్నారు. దీంతో స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ నుంచి చికెన్ బిర్యాని తీసుకురాగా దాన్ని పూర్తిగా తిన్నాడని చెబుతున్నారు.
విచారణ సమయంలో ఎక్కడా బెరుకు, భయం లేకుండా అడిగిన ప్రశ్నలకు తడుం కోకుండా సమాధానాలు చెబుతుండడంతో అధికారులు కూడా ఒకింత విస్మయానికి గురయ్యారు. మధ్యాహ్నం విచారణను వేగవంతం చేశారు. ఒక్కొక్కరిగా సహచర సిబ్బందితో పాటు స్నేహితులు వస్తుండడంతో స్టేషన్ వద్ద మీడియా హడావుడి ఎక్కువగా కన్పించింది. చివరకు హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ను కూడా విచారణకు పిలిపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ సాగింది. 8 గంటల సమయంలో సీపీ మహేష్‌చంద్ర బయటకొచ్చి మీడియాకు తొలిరోజు విచారణ పురోగతిని వివరించారు. హోటల్ యజమాని హర్షవర్ధన్‌తో సహా తొలి రోజు 12 మందిని విచారించారు. మూడు బ్యాంకుల్లో అకౌంట్‌ల లావాదేవీలపై సోమవారం విచారణ జరుపుతామని, కాల్ డేటాను పరిశీలించి అనుమానం వచ్చిన వారందర్ని పిలిపించి విచారిస్తామని సీపీ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో తొలిరోజు పురోగతి పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ అధికారులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నిందితుడు నేరుగా సమాధానం చెప్పలేదని తెలియవచ్చింది. సోమవారం ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతా ల పరిశీలన జరిపితే మరిన్ని వాస్తవాలు వె లుగులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మీడియా సహకరించాలి
ఎన్‌ఏడీజంక్షన్(విశాఖపశ్చిమ): సిట్ విచారణ జరుగుతోంది.. మీడియా సహకరించాలని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మళ్ల శేషు కోరారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ను ఆదివారం ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మీడియా అక్కడకు చేరింది. దీంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్ సీఐ మళ్ల శేషు మీడియాతో మాట్లాడుతూ మీరంతా ఇక్కడ ఉండడం వల్ల విచారణకు ఇబ్బంది కలుగుతోంది. కాస్త సహకరించాలని మీడి యా ప్రతినిధులను కోరారు. నవంబర్ 2 వరకు విచారణ చేపడతామని పేర్కొన్నారు. కోర్టు ఆరు రోజులు పాటు విచారణ కోసం అనుమతి ఇచ్చిందన్నారు. నిందితుడు సహకరిస్తున్నాడా అన్న ప్రశ్నకు సహకరిస్తాడని అనుకుంటున్నాను, విచారణ అధికారులు డీల్‌చేస్తున్నారని పేర్కొన్నారు.
సిట్ అధికారుల సెల్‌ఫోన్ల స్విచ్ ఆఫ్
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖపశ్చిమ): ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణ గురించి సమాచారం బయటకు పొక్కకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా రు. విచారణ సమయంలో మీడియాకు లీకులిస్తున్నారన్న అనుమానంతో ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడంతా చెప్పుకుంటున్నారు. విచారణ చేపడుతున్న అధికారుల సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. వీరితో పాటు ఎస్‌ఐలు, కిందిస్థాయి సిబ్బంది సెల్‌ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లోనే ఉన్నాయి. అత్యవసరమైతే బయటకు వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. ‘ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి..లీకులిస్తున్నామంటూ అధికారులు మాపై మండిపడుతున్నారు’ అని మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు.
విచారణకు ప్రత్యేక గది ఏర్పాటు
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖపశ్చిమ): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడ్ని విచారించేందుకు సిట్ అధి కారులకు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో నేర విభాగం ఏసీపీ కార్యాలయం పక్కనే ఖాళీగా ఉన్న కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ కంప్యూటర్, ప్రింటర్ వంటి సామగ్రిని ఏర్పాటు చేశారు. అయితే దీనికి భద్రత కొంత తక్కువగా ఉండడంతో విచారణ వరకే వినియోగించే అవకాశముంది. నిందితుడ్ని ఇక్కడే ఉంచుతారా? లేదా? అని ఇంకా నిర్ధారణకు రాలేదు. సోమవారం నుంచి విచారణ ఇక్కడే జరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment