నరసాపురం రూరల్ , న్యూస్‌లైన్ : రానున్న సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఇందుకోసం గ్రామాల వారీ బీట్ కు కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఆదివారం నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడిపందాలను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, రాత్రివేళల్లో కానిస్టేబుళ్ల బీట్‌లు ముమ్మరం చేశామన్నారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ విజిటింగ్‌పై దృష్టి సారించి రానున్న రోజుల్లో నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందిని కూడా పెంచుతున్నామన్నారు.
ప్రస్తుతం రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో శిక్షణ పొందుతున్న 150 మంది ఎస్సైలు జనవరిలో విధుల్లో చేరతారన్నారు. దొంగనోట్ల చలామణిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఐజీ సమాధానమిస్తూ ఈ వ్యవహారం ఏలూరు రేంజ్ పరిధికి మాత్రమే సంబంధించింది కాదని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే కొంత వరకు సమాచారం లభించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి నకిలీ కరెన్సీ వస్తోందన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఇక్కడకు వచ్చానని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరీశీలించేందుకు సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. మెరైన్ పోలీస్ స్టేషన్ విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని, కృష్ణాజిల్లా పాలకాయతిప్ప గ్రామంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మాణంలో ఉందన్నారు. ఆయన వెంట డీఎస్పీ రఘువీర్‌రెడ్డి, సీఐ నాగమురళి, రూరల్ ఎస్సై గుజ్జర్లపూ డి దాసు, మొగల్తూరు ఎస్సై ఆకుల రఘు ఉన్నారు.
సంక్రాంతి కోడిపందాలపై ప్రత్యేక దృష్టి
Published Mon, Dec 16 2013 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement