పర్యాటకం పదునెక్కాలి
సాక్షి, ఏలూరు : జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. విజయవాడలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల ప్రథమ సమావేశంలో ముఖ్యమంత్రితో కలెక్టర్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయూలని, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల పెంపకాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు.
పతి ఇంటినుంచి ఒక మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ మ్యాపింగ్‌ను ఉపయోగించుకుని సర్కార్ భూములను కాపాడటంతోపాటు, కొత్త సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూములను సిద్ధం చేయూలన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని తీసుకుని నిరుపయోగంగా ఉంచిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
మహిళా అక్షరాస్యతను మెరుగుపరచాలని, గర్భిణి, శిశు మరణాలను నివారించడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. యువతలో వృత్తి నైపుణ్యత మెరుగుపరచడానికి పథకాలను రూపొందించాలని, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ముఖ్యంగా సేవల రంగాన్ని విస్తరించడానికి చర్యలు చేపట్టాలనిఆదేశించారు. అభివృద్ధిలో సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని (ఐటీ) పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు.
సమష్టిగా అభివృద్ధి సాధిస్తాం: కలెక్టర్
సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఆవశ్యకత, కేంద్ర సంస్థల ఏర్పాటుకు గల అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ భూముల లభ్యత, వ్యవసాయ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు కలెక్టర్ వివరించారు.