ఎల్.కోట మండలం, కిత్తన్నపేట తోట వద్ద అమ్మకానికి తరలించేందుకు సిద్ధం చేసిన డ్రాగన్ పండ్లు
శృంగవరపుకోట రూరల్: విదేశాల్లో సంపన్నులు తినే డ్రాగన్ ఫ్రూట్స్ మన ప్రాంతంలో కనిపించవు. అలాంటి అరుదైన పంటను బొండపల్లి, డెంకాడ, లక్కవరపుకోట మండలాల్లో ఔత్సా హిక రైతులు సాగుచేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా యువ రైతులు పండ్ల తోట లు సాగుచేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధిక దిగుబడులు వస్తుండడంతో సంతోసపడుతున్నారు. మన ప్రాంతంలో విస్తారంగా సాగుచేయవచ్చని చెబుతున్నారు.
ఎర్రగా, నల్లని గింజలతో డ్రాగన్ పండు లోపలిభాగం..
అన్ని రకాల నేలలు అనుకూలం..
డ్రాగన్‌ఫ్రూట్స్ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు మరింత శ్రేష్టం. ఈ పంటను అధికంగా వియత్నాం, థాయ్‌లాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక వంటి విదేశాల్లో పండిస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3–4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంట పండించుటకు, మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. సిమెంట్/కాంక్రీట్ స్తంభాలను ఎకరానికి 500 వరకు అవసరమవుతాయి. ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాలి. స్తంభానికి పైన టైర్/ఇనుప చక్రం ఉంచాలి. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా, జారిపోకుండా ఊతం అందిస్తుంది. ఎకరానికి సుమారుగా 2, 000 మొక్కలు నాటాలి.
20 సంవత్సరాల వరకు దిగుబడి..
ఈ పంట ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, 1 అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో రెండు సార్లు (జూన్ మరియు జనవరి లో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమా న్ని పిచికారీ చేయాలి. సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
తోటలో కోత దశకు చేరువలో ఉన్న డ్రాగన్ పండ్లు
జూన్–అక్టోబర్ నెలల్లో..
డ్రాగన్‌ఫ్రూట్ పూత, కాయ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. పంట పొలంలో విద్యుత్ లైట్లను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు. డ్రాగన్ సాగుకు ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు దిగుబడి 6–8 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో డ్రాగన్‌ఫ్రూట్ కేజీ ధర రూ.150–200 వరకు పలుకుతోంది.
సాగు బాగుంది...
డ్రాగన్ పండ్ల మొక్కలను నాలుగు ఎకరాల్లో సాగుచేశాను. ఎకరాకు మొదటి క్రాప్‌లో 4–5 టన్నుల దిగుబడి వచ్చింది. పండ్లను విశాఖలో అమ్ముతున్నాం. మార్కెట్ బాగుంది. ఎకరాకు సుమారు రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి మినహాయిస్తే రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు మిగులుతోంది.
– జస్టిన్, కిత్తన్నపేట, ఎల్.కోట మండలం
పూత దశలో ఉన్న డ్రాగన్‌ఫ్రూట్ తోట
సాగుపై ఆసక్తి చూపాలి
రైతులు కొత్తగా ఆలోచించాలి. పండ్ల తోటల సాగుతో పాటు మార్కెటింగ్ వ్యూహాన్ని పసిగట్టాలి. పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్న పెద్ద రైతులు డ్రాగన్ పండ్ల మొక్కల సాగుపై ఆసక్తి చూపాలి. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలను ఆర్జించవచ్చు. డ్రాగన్‌ఫ్రూట్‌ను తెలుగులో సిరి జమ్మెడ చెట్టు అంటారు. ఇది ఎడారి జాతికి చెందిన పండ్ల మొక్క. తక్కువ నీటితో సాగుచేయవచ్చు. ఈ పండ్లలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండును తినడం ద్వారా బరువు నియంత్రణ, ఆస్తమా, చెడు కొలెస్ట్రాల్ తగ్గటం, డయాబెటిస్ నియంత్రణ లాంటి ఎన్నో ఉపయోగాలు చేకూరుతాయి. అందుకే పండ్లకు ఎప్పుడూ ధర ఉంటుంది.
– బండారు దీప్తి, ఉద్యానవన శాఖ అధికారి, ఎస్.కోట
డ్రాగన్ తోటల సాగును పరిశీలిస్తున్న జిల్లా ఉద్యాన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment