పట్నా : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’గా మార్చిన తరువాత డ్రాగన్ పండు దేశం దృష్టిని ఆకర్షించిన మాట నిజమేగానీ ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా తక్కువ కాలరీలున్న డ్రాగన్ ఫ్రూట్ గిరాకీని పెంచింది. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ గత కొన్నేళ్ళుగా బిహార్‌లోని రైతులకు మంచి జీవనోపాధిని కల్పిస్తోంది. సాంప్రదాయ వ్యవసాయానికి దూరంగా ఉంటూ ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని భావించే బిహార్‌లోని కోసి, సీమాంచల్ రైతాంగం డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక హెక్టార్ భూమిపై తొలుత 6 నుంచి 8 లక్షలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 8 నుంచి 10 లక్షల ఆదాయాన్ని సులభంగా సంపాదిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ వైభవానికో చరిత్ర
బిహార్‌లో డ్రాగన్ ఫ్రూట్ వైభవానికి ఓ చరిత్ర ఉంది. ఆ కథే కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కి ఉందని అంటారు హార్టికల్చర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ సింగ్. ఆ కథేంటో తెలుసుకోవాలంటే 2014వ సంవత్సరానికి వెళ్ళాల్సిందే. 2014లో కిషన్ గంజ్‌లో డ్రాగన్ ఫ్రూట్ విజయగాథ ప్రారంభం అయ్యింది. నాగరాజ్ నఖ™Œ అనే ఔత్సాహిక రైతు సింగపూర్ నుంచి 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తీసుకొచ్చాడు. మొదట 5 హెక్టార్ల భూమిలో 100 మొక్కలతో పని ప్రారంభించారు. అవి పెరిగి పెద్దవై 15,000 నుంచి 20,000 మొక్కలకు పెరిగాయి.
పెట్టుబడి ఎంత?
ప్రారంభంలో ఒక హెక్టారుపై 6 నుంచి 8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదు అడుగుల పొడవున్న పోల్స్, వాటిపైన రింగులుగా టైర్లు, బిందు వ్యవసాయం కోసం వాడే వ్యవసాయ పరికరాలను అమర్చుకోవడం కోసం ఈ పెట్టుబడిని వినియోగించాల్సి ఉంటుంది. మూడేళ్ళ తరువాత మనం పెట్టే పెట్టుబడిపై రాబడిరావడం మొదలౌతుంది. ఆ తర్వాత రైతులు ఏడాదికి సులువుగా 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదించగలుగుతారు.
డ్రాగన్ వైపు మొగ్గు చూపుతున్న జిల్లా రైతాంగం
కిషన్ గంజ్‌తో సహా పొరుగు జిల్లా ప్రజల్లో డ్రాగన్ ప్రూట్ పంటపై అవగాహన కల్పిస్తోన్న హేమంత్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘సమీప జిల్లాల్లోని రైతులు పూర్ణియా, సుపాల్, అరారియాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై తరచూ ఆరాతీసేవారు. ఆ తరువాత మెల్లిగా వారి వారి ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని సాగుచేయడం ప్రారంభించారు’ అని చెప్పారు. కేవలం ఒక్క కిషన్ గంజ్‌లోనే 12 ఎకరాల భూమిలో రైతులు డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలైన కోసి, సీమాంచల్ జిల్లాల్లో రైతులు కూడా డ్రాగన్‌ఫ్రూట్‌ని సాగుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే విషయంలో సమస్యలెదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్‌ని కొనుగోలుచేసేందుకు వ్యాపారులు వస్తున్నారు. కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ 300 నుంచి 400 రూపాయలు ధర పలుకుతున్నాయి.
ప్రోత్సహిస్తే రైతు పంట పండినట్లే..
సంప్రదాయక పంటల విషయంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. ‘రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పైనే ఆధారపడాల్సి ఉంటుందని ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్‌ని పరిచయం చేసిన నాగరాజ్ అంటారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ విషయంలో తాను కనీసం స్థానిక మార్కెట్ అవసరాలకు సరిపోయే పంటను అందించలేకపోతున్నాను అంటారాయన. అందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తే, రైతులు లాభదాయకమైన డ్రాగన్ ఫ్రూట్ పంటలవైపు మొగ్గుచూపుతారని నాగరాజ్ అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్‌లను ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పించేందుకు కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) 500 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. ఎర్రటి పండులో ఎరుపు గుజ్జు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ అత్యంత ప్రాచుర్యం పొందిన రకం అని హేమంత్ కుమార్ సింగ్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ పంటలపై అవగాహనకు బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సాబోర్, డ్రాగన్ ఫ్రూట్స్ పండించే విధానంపై ఓ వీడియో పోస్ట్ చేసింది. దీన్ని రైతులు విస్తృతంగా చూశారు అని యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ఆర్.కె.సోహానే తెలిపారు.
50 శాతం రాయితీతో..
డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని వివరిస్తూ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ కుమార్, ఈ యేడాది నుంచి, వైశాలి జిల్లాలోని దేశ్రీ వద్ద 0.4 ఎకరాల భూమిలో డ్రాగన్ పండ్ల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. మొక్కకు 20 రూపాయల చొప్పున 50 శాతం రాయితీతో ఈ మొక్కలను రైతులకు అందిస్తారు. ‘కిషన్ గంజ్‌లో డ్రాగన్ పంట ఫలవంతమైన తరువాత ప్రభుత్వం ఈ పంటను విస్తృతపరిచే విషయంపై దృష్టి సారించింది. దక్షిణ బిహార్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అని రాకేష్ కుమార్ చెప్పారు.
డ్రాగన్ ఫ్రూట్ కాదుకమలం పండు
ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’ అని మార్చి గుజరాత్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని, ధర రీత్యా విలువైనదేనని రూపాని అన్నారు.
కమలం ఉపయోగాలు..
- రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది.
- ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
- ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment