సాక్షి, న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువతరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇద్దరు యువనాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు ముహుర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సెప్టెంబర్ 28న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొదట అక్టోబర్ 2 గాంధీ జయంతిన వీరివురు కాంగ్రెస్‌లో చేరతారని వార్తలొచ్చాయి. అయితే ఇది మరింత ముందుగా భగత్‌సింగ్ జన్మదినమైన సెప్టెంబర్ 28న ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: (తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!)
గుజరాత్‌లోని వడ్గామ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరి బీహార్ యూనిట్‌ను బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై కన్హయ్య కుమార్ ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. బిహార్ ఎన్నికల సమయానికి కన్హయ్యను పార్టీలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: (పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి)
Comments
Please login to add a commentAdd a comment